ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక, ధార్మిక సమాగమం మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్‌లోని త్రివేణీ సంగమం దగ్గర జరుగుతున్న సంగతి తెలిసిందే. 144ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా సమయంలో గంగ, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో స్నానం చేయడం పుణ్యాన్ని కలగజేస్తుందని హిందువుల విశ్వాసం. ఆ అద్భుతమైన అవకాశాన్ని జైళ్ళలోని ఖైదీలు ఎందుకు పోగొట్టుకోవాలి? అందుకే ఉత్తరప్రదేశ్ అధికారులు రాష్ట్రంలోని 75 జైళ్ళలో ఉన్న సుమారు 90వేల మంది ఖైదీలకు త్రివేణీ సంగమ జలాలతో కుంభమేళా స్నానం ఆచరించే అవకాశం కల్పించారు.
ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ, అయోధ్య, అలీగఢ్ వంటి వివిధ పట్టణాలలోని జైళ్ళకు అధికారులు త్రివేణీ సంగమ క్షేత్రం నుంచి పవిత్ర జలాలను తీసుకుని వెళ్ళారు. అక్కడ జైళ్ళలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి తొట్టెల్లో ఈ జలాలను కలిపి, తద్వారా కుంభస్నానం ఆచరించే అవకాశాన్ని ఖైదీలకు కల్పించారు. పవిత్ర స్నానాలు చేసిన తర్వాత ఖైదీలు జైల్లోనే ప్రార్థనలు, పూజా కార్యక్రమాలూ నిర్వర్తించుకున్నారు.
లఖ్‌నవూ నగరంలోని జైల్లో జరిగిన కార్యక్రమానికి యూపీ జైళ్ళశాఖ మంత్రి దారాసింగ్ చౌహాన్ హాజరయ్యారు. ‘‘బైట స్వేచ్ఛగా ఉండే ప్రజలు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలరు. కానీ జైళ్ళలో బందీలుగా ఉన్నవారు తమ విశ్వాసాన్ని అనుసరించే అవకాశం లేదు. వారు జైలు నాలుగు గోడలనూ దాటి పోలేరు. అందుకే వారికి ఈ అవకాశం కలగజేసాం. జైళ్ళ శాఖలోని అందరు అధికారుల సహకారంతో రాష్ట్రంలోని సుమారు 90వేల మంది ఖైదీలకూ ఈ పద్ధతిలో కుంభస్నానం ఆచరించే వెసులుబాటు కల్పించాం’’ అని ఆయన చెప్పారు.
నిజానికి చాలాచోట్ల జైళ్ళలోని ఖైదీలే తమకు ఈ సౌకర్యం కల్పించమని విజ్ఞప్తి చేసారని మంత్రి చెప్పారు. ‘‘బైట ఉన్న జనాలు త్రివేణీ సంగమానికి వెడుతున్నారు, పవిత్ర స్నానాలు చేస్తున్నారు. మాకు కూడా కుంభమేళా మీద విశ్వాసం ఉంది. సనాతన ధర్మం ప్రకారం త్రివేణీ సంగమంలో స్నానం చేయాలని మేమూ కోరుకుంటున్నాం అని వారు అడిగారు. అందుకే మేము ఆ వెసులుబాటు కల్పించాము’’ అని వివరించారు.
‘‘రాష్ట్రప్రభుత్వం సూచనల మేరకు స్నాన పర్వానికి ఏర్పాట్లు చేసాము. ఖైదీల్లో వేర్వేరు మతాలకు చెందిన వారు సైతం ఈ కుంభస్నానాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు’’ అని అలీగఢ్ జైలు సూపరింటెండెంట్ బ్రిజేంద్ర సింగ్ యాదవ్ వెల్లడించారు.
2025 జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పర్వదినాన ముగుస్తుంది. అయితే ఈ ఉదయం సమయానికే, 60కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.