కార్ల తయారీలో ప్రపంచంలో దిగ్గజ సంస్థ టెస్లా భారత్లో ప్రవేశానికి మార్గం సుగమమైంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన తరవాత టెస్లా తన కార్యకలాపాలను విస్తరించేందుకు భారత్లో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టింది.టెస్లా భారత మార్కెట్లో అడుగు పెడితే దేశీయ కార్ల కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి ఉంటుందని వస్తోన్న ఆందోళనలను గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ కంపెనీ సీఎల్ఎస్ఏ కొట్టిపారేసింది.
దిగుమతుల సుంకం 50 శాతం కన్నా అధికంగా ఉండటంతో గత ఆరేళ్లు టెస్లా కారు భారత రోడ్లపై అడుగు పెట్టలేకపోయింది. తాజాగా భారత ప్రభుత్వం సుంకాలను 20 శాతం కన్నా తక్కువకు తగ్గించడంతో భారత్ రోడ్లపై టెస్లా ఈవీ కార్లు పరుగులు పెట్టనున్నాయి.
టెస్లా కారు ధర భారత్లో ఎంత ఉంటుంది?
టెస్లా ఈవీ చౌక మోడల్ ధర అమెరికాలో 35000 వేల డాలర్లుగా ఉంది. అంటే దాదాపు రూ.30లక్షలు పడుతోంది. అదే కారుపై మరో 20 శాతం దిగుమతుల సుంకం, బీమా, రోడ్ టాక్స్ కలుపుకుంటే భారత్లో చౌక మోడల్ టెస్లా కారు 46 వేల డాలర్లు దాటవచ్చని అంచనా అంటే ఒక్కో టెస్లా ఈవీ కారు రూ.40లక్షలకు కొంచెం అటూ ఇటుగా ఉంటుందని సీఎల్ఎస్ఏ అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలోని దిగ్గజ కార్ల తయారీ దారులు మహింద్రా, టాటా సంస్థలు రూ.25 లక్షలకే ఈవీలను అందిస్తున్నాయి.ఇలాంటి సమయంలో టెస్లా కారు భారత ఈవీ తయారీదారులను దెబ్బతీస్తుందన్న అనుమానాలను కొట్టిపారేస్తున్నారు.
టెస్లా ప్రస్తుతానికి భారత్కు అమెరికా నుంచి కార్లు దిగుబడి చేసినా దేశంలో తయారీ ప్లాంటు పెట్టేందుకు అనువైన స్థలం కోసం వెతుకుతోంది. దాదాపు 40 వేల కోట్ల వ్యయంతో టెస్లా భారత్ ప్లాంట్ #teslaevcar రానుంది. దేశంలో తయారు చేస్తే దిగుమతి సుంకం ఉండదు కాబట్టి భారత ఈవీ తయారీదారులకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు.