తెలంగాణ, ఒడిశా మీదుగా రెండురోజుల కిందట ఏర్పడిన ద్రోణి బలహీనపడిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాయలసీమ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు తూర్పు ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ వాతావరణ మార్పులతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల, తెలంగాణలో అక్కడకక్కడా తేలికపాటి జల్లులు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉపరితల ద్రోణి కారణంగా వాతావరణం చల్లబడే సూచనలు లేవని అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రానున్న మూడు రోజులకు గాను పగటి ఉష్ణోగ్రతలు కోస్తా జిల్లాల్లో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా ఉంటాయని రాయలసీమ జిల్లాల్లో 1 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని అధికారులు తెలిపారు.
తెలంగాణలో చూస్తే పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. రాబోయే మూడు రోజులు ఉదయం వేళ కొన్నిచోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.