కొద్దిరోజుల్లో రానున్న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కృష్ణానదిలో పవిత్ర స్నానాలు చేయాలనుకునే భక్తులకు సహకరించాలని కనకదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణా అధికారికి విశ్వహిందూ పరిషత్ నాయకులు విజ్ఞప్తి చేసారు. దుర్గగుడి చేరువలో ఉన్న కృష్ణానది స్నాన ఘట్టాలను పరిశుభ్రం చేయించాలని కోరారు.
‘‘ఫిబ్రవరి 26 బుధవారం హిందువులకు ఎంతో పవిత్రమైన పండుగ శ్రీ మహాశివరాత్రి పర్వదినం. ఆరోజు విజయవాడ కృష్ణమ్మ చెంత లక్షలాది హిందువులు అతిపవిత్రమైన నదీస్నానం ఆచరించి శివాలయాల దర్శనానికి వెళ్ళి ఆ పరమ శివుణ్ణి దర్శించుకోవడం అనాదిగా వస్తున్న సనాతన ధర్మంలోని అంతర్భాగం. కాబట్టి విజయవాడలో ఉన్న అన్ని స్నానఘాట్‌లను వెంటనే యుద్ధప్రాతిపదికన పరిశుభ్రం చేయించి బ్లీచింగ్ జల్లించి స్వచ్ఛం చేయించాలి. అలాగే మహిళలు దుస్తులు మార్చుకొనుటకు తాత్కాలికంగా షెడ్‌లతో కూడిన గదులను ఏర్పాటు చేయాలని మరీ ముఖ్యంగా షవర్‌బాత్‌లను పూర్తిగా నిషేధించి ప్రతీ ఒక్కరూ హిందూ సంప్రదాయం ప్రకారం కచ్చితంగా నదిలో మునిగి స్నానం ఆచరించే విధంగా ఏర్పాట్లు చేయాలి. అలాగే గజఈతగాళ్ళను కూడా నియమించి భక్తులకు భద్రత కల్పిస్తారని ఆశిస్తూ తక్షణమే పైన తెలిపిన విధంగా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాము’’ అంటూ విశ్వహిందూ పరిషత్ దుర్గ గుడి ఈఓకు విజ్ఞప్తి చేసింది.
విశ్వహిందూ పరిషత్ ఎన్‌టిఆర్ జిల్లా విజయవాడ మహానగర్ ప్రధాన కార్యదర్శి క్రోవి రామకృష్ణ, శ్యాంప్రసాద్, అనుపతి, బీజేపీ తరఫున పొట్టి శ్రీహరి కలిసి దుర్గమ్మ ఆలయం ఈఓకు వినతిపత్రం అందజేసారు. అదే విజ్ఞప్తి పత్రం కాపీని విజయవాడ నగర మునిసిపల్ కమిషనర్‌కు కూడా అందించారు.