సీనియర్ జీఎస్టీ అదనపు కమిషనర్, ఆయన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మనీష్ విజయ్ కొచ్చిలో జీఎస్టీ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. కొన్ని రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. సహచరులు ఫోన్ చేసినా సమాధానం లేదు. దీంతో అనుమానం వచ్చిన సహచరులు శుక్రవారం మనీష్ ఇంటికి చేరుకుని పరిశీలించారు. దీంతో వారి కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
మనీష్ విజయ్, ఆయన భార్య షాలిని వేర్వేరు గదుల్లో ఉరి వేసుకుని కనిపించారు. తల్లి శకుంతల కూడా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. వీరు చనిపోయి కొన్ని రోజులు అవుతోందని, దుర్వాసన వస్తోందని ఫోరెన్సిక్ నివేదిక తరవాత పూర్తి వివరాలు అందిస్తామని కొచ్చి పోలీస్ కమిషనర్ పుట్టా విమలాదిత్య వెల్లడించారు. జార్ఖండ్‌కు చెందిన మనీష్ విజయ్ కొచ్చిలో జీఎస్టీ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్నారు.
2006 జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించిన మనీష్ భార్య షాలిని జాయింట్ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. షాలిని ఓ కీలక కేసును ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. దీని కోసం మనీష్ ఉద్యోగానికి సెలవు పెట్టారు. షాలిని నియామకం అక్రమమంటూ కేసు నమోదు కావడంతో 2024లో సస్పెండ్ చేశారు.
కొచ్చి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనీష్ సోదరి అమెరికా నుంచి వచ్చిన తరవాత పోస్టు మార్టం నిర్వహించాలని నిర్ణయించారు. మనీష్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఇంటిలో ఓ డైరీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అనుమానాస్పద కేసుగా పోలీసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.