ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆప్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. అన్నివిభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేసిన దక్షిణాఫ్రికా 107 పరుగులతో భారీ విజయం సాధించింది. కరాచీలో జరిగిన గ్రూప్-బి మ్యాచ్ లో
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (103) సెంచరీతో రాణించాడు. కెప్టెన్ టెంబా బావుమా(58), రాస్సీ వండర్ డస్సెన్(52), ఐడైన్ మార్క్రమ్(52 నాటౌట్) రాణించారు.
ఆప్ఘనిస్తాన్ బౌలర్లలో మహ్మద్ నబీ రెండు వికెట్లు తీయగా ఫరూఖీ, ఒమర్జాయ్ తలా వికెట్ తీశారు. స్పిన్నర్ రషీద్ ఖాన్ కు ఒక్క వికెట్ దక్కింది.
లక్ష్యఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 43.3 ఓవర్లలో 208 పరుగులు మాత్రమే చేయగల్గింది. రహ్మత్ షా( 90)ఒంటరిపోరాటం చేసిన ఆప్ఘనిస్తాన్ కు ఓటమే దక్కింది. కెప్టెన్ హష్మతుల్లా షాహిది డకౌట్ అయ్యాడు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడా మూడు వికెట్లు తీయగా లుంగీ ఎంగిడి , వియాన్ ముల్డర్ చెరో రెండు వికెట్లు తీశారు. మార్కో యన్సెన్ , కేశవ్ మహారాజ్ చెరొక వికెట్ తీశారు.
నేడు ఇంగ్లాండ్, ఆసీస్ మధ్య లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.