అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీకీ (సిఐఎ), భారతదేశంలోని జాతీయవాద స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కీ (ఆర్ఎస్ఎస్) సంబంధాలున్నాయంటూ కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేడా తప్పుడు వ్యాఖ్యలు చేసారు. ధీరేంద్ర ఝా రాసిన ‘గోళ్వాల్కర్ : ది మిత్ బిహైండ్ ది మ్యాన్, ది మ్యాన్ బిహైండ్ ది మెషీన్’ అనే పుస్తకాన్ని ఉటంకిస్తూ, పవన్ ఖేడా ఆ తప్పుడు ఆరోపణలు చేసారు. 1966లో గోవధ నిషేధ ఉద్యమానికి, కాంగ్రెస్ అధ్యక్షుడు కామరాజ్ మీద జరిగిన హత్యా ప్రయత్నానికీ, దేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ సహచరుడు కృష్ణమీనన్‌ను ఓడించడానికీ కూడా ఆర్ఎస్ఎస్ ప్రయత్నించిందనీ… వాటికోసం సంఘానికి సిఐఎ నిధులు సమకూర్చిందనీ ఆరోపణలు చేసారు.
తప్పుడు కథలే ఆధారం:
కాంగ్రెస్ పార్టీ అల్లిన ఈ కట్టుకథలకు ఆధారం 1967లో అమెరికాకు చెందిన జాన్ స్మిత్ చేసిన కొన్ని ప్రకటనలు ఆధారం. ఆర్ఎస్ఎస్‌కూ, సీఐఏకు మధ్య సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ జాన్ స్మిత్ అమెరికాకు శత్రువైన సోవియట్ యూనియన్‌కు చెందిన ఒక పత్రికలో వ్యాసం రాసాడు. దాన్ని కమ్యూనిస్టు పార్టీ అయిన సీపీఐ ఆంగ్లంలోకి అనువదించి భారతదేశంలో ప్రచారం చేసింది. నిజానికి అప్పట్లో భారత సైన్యానికి, భారతీయ జనసంఘ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లకు స్వదేశంలో పెరుగుతున్న ఆదరణను ఓర్చుకోలేక సీపీఐ పార్టీ ఆ అబద్ధాలను ఒక కరపత్రం రూపంలో వ్యాప్తిలోకి తీసుకొచ్చింది.
పరువునష్టం దావా:
సిపిఐ వారపత్రిక ‘ది న్యూ ఏజ్’లో ప్రచురించిన ఆ కరపత్రం మీద 1969లో భారత సైన్యానికి చెందిన రిటైర్డ్ బ్రిగేడియర్ ఇ.టి సేన్ పరువునష్టం దావా దాఖలు చేసారు. తనను సిఐఎ ఏజెంట్‌గా పేర్కొంటూ అబద్ధాలు, కట్టుకథలూ అల్లారని ఆయన మండిపడ్డారు. ఆ కథనం మొత్తం అబద్ధమేనని, అందులో ఒక్క అక్షరమైనా నిజం లేదనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ పరువునష్టం దావాను విచారణలో ది న్యూ ఏజ్ వారపత్రిక ముద్రాపకుడు-ప్రచురణకర్త అయిన డి.పి సిన్హా తన తప్పు ఒప్పుకొని బ్రిగేడియర్‌ను క్షమాపణలు అర్ధించారు. ‘‘ఆ కరపత్రాన్ని ప్రచురించినప్పుడు అందులో చేసిన తీవ్రమైన ఆరోపణలను, జాన్ స్మిత్ రాతలను నేను ధ్రువీకరించులేదు. దానివల్ల బ్రిగేడియర్ ఇ.టి సేన్‌కు జరిగిన హానికి క్షమాపణలు చెబుతున్నాను. ఆయన ప్రకటనే సరైనది అని ఒప్పుకుంటున్నాను. మేం ప్రచురించిన కరపత్రం విషయంలో చింతిస్తున్నాను. దాని కాపీలు ఇంకేమీ మిగల్లేదు. ఇకపై దాన్ని ముద్రించబోము. మా తప్పును క్షమించాలని ఇ.టి సేన్‌ను కోరుతున్నాను. ఈ ప్రకటనను సేన్ ఏ రూపంలోనైనా బహిరంగపరచడానికి మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు’’ అంటూ డి.పి సిన్హా న్యాయస్థానంలో తన తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పారు.
అలా, ఆ కరపత్రం ద్వారా ప్రచారం చేసిన విషయాలన్నీ అబద్ధాలేనని సీపీఐ పార్టీ నాయకుడే ఒప్పుకుని, క్షమాపణలు చెప్పి, ఇకపై ఆ సమాచారాన్ని ఏవిధంగానూ ప్రచారం చేయబోము అని న్యాయస్థానం ముందు ఒప్పుకున్నారు. అయినప్పటికీ ధీరేంద్ర ఝా, శశి థరూర్, పవన్ ఖేడా వంటి వారు అవే అబద్ధాలను పదేపదే ప్రచారం చేస్తున్నారు.
అసలు ఈ జాన్ స్మిత్ ఎవరు?
ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చిన జాన్ స్మిత్ సీఐఏ ఏజెంటు అంటూ చేసిన ప్రచారం కూడా అబద్ధమే. నిజానికి జాన్ స్మిత్ అమెరికా ప్రభుత్వం స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో 1950 అక్టోబర్ 29న కమ్యూనికేషన్ క్లర్క్‌గా చేరాడు. 1959లో అతను ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు.
1959లోనే తన ఉద్యోగం వదిలిపెట్టి పోయిన వ్యక్తికి ఆ తర్వాత జరిగిన సంఘటనల గురించి ఏమాత్రం తెలిసే అవకాశం లేదు. వి.కె కృష్ణమీనన్ 1962 ఎన్నికల్లో ఓడిపోయారు. గోవధ నిషేధ ఉద్యమం 1966లో జరిగింది. వాటి గురించి జాన్ స్మిత్‌కు ఏమీ తెలియదు. సిఐఏతో సంబంధాలే లేని జాన్ స్మిత్‌కు ఆర్ఎస్ఎస్‌తో సంబంధాలు అంటగట్టారు. దాన్నిబట్టే ఆ ప్రచారమంతా కట్టుకథ అని తెలిసిపోతోంది. అలా, ఈ కథ మొత్తం రాజకీయ దురుద్దేశాలతో ప్రచారం చేయబడుతోంది తప్ప దానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఆ విషయం కోర్టులో నిరూపణ అయి, ఆ దుష్ప్రచారం చేసిన కమ్యూనిస్టులు తమ తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పారు. అలాంటి నిరాధారమైన, న్యాయస్థానంలో అబద్ధమని నిరూపణ అయిన విషయాలను కాంగ్రెస్ నాయకులు మళ్ళీ మళ్ళీ ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్ధం చేసుకోవడం కష్టమేమీ కాదు.