ప్రయాగరాజ్‌లో జరుగుతున్న ప్రపంచపు అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహాకుంభమేళా నిర్వహణ విజయం గురించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రస్తావించారు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన యోగి ఆదిత్యనాథ్, కుంభమేళా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోకి రూ.3లక్షల కోట్లకు పైగా సొమ్ములను తీసుకొస్తోందని చెప్పారు.
సమాజ్‌వాదీ పార్టీ ఎంఎల్ఎ రాగిణీ సొంకర్ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జవాబిస్తూ గత ఎనిమిదేళ్ళలో రాష్ట్రంలొ 6కోట్ల కంటె ఎక్కువమందిని దారిద్ర్య రేఖ వెలుపలకు తేగలిగామని చెప్పారు.
‘‘గత పదేళ్ళలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో 25కోట్ల కంటె ఎక్కువమందిని దారిద్ర్య రేఖ వెలుపలికి తీసుకురాగలగడం గర్వకారణం. గత ఎనిమిదేళ్ళలో మా ప్రభుత్వం 6కోట్ల కంటె ఎక్కువ మందిని దారిద్ర్యరేఖ వెలుపలికి తీసుకురాగలిగింది. ప్రతీ రంగంలోనూ మార్పులు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ సామర్థ్యాన్ని ఇవాళ దేశమూ, ప్రపంచమూ చూడగలుగుతున్నాయి. మహాకుంభమేళా నిర్వహణే దానికి నిదర్శనం. మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలోకి రూ.3లక్షల కోట్ల కంటె ఎక్కువ పెరుగుదలను తీసుకొస్తోంది’’ అని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.
తమ ప్రభుత్వం మహిళా సాధికారతగురించి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని యూపీ సీఎం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగంలో రిక్రూట్ చేసుకున్నవారిలో 20శాతం మంది మహిళలేనని వివరించారు. ‘‘మహిళా సాధికారత కోసం గొప్ప కృషి జరిగింది. యూపీ పోలీస్ నియామకాల్లో 20శాతం మహిళలే. అలాగే ప్రతీ రంగంలోనూ మహిళలకు అవకాశాలు లభించాయి’’ అని ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వ పాలనలో దేశంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని యోగి చెప్పారు. వంద కోట్ల డాలర్ల లక్ష్యాన్ని సాధించే దిశగా పయనిస్తున్నామన్నారు. 2029 నాటికి దేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉత్తరప్రదేశ్ ఎదుగుతుందని వివరించారు.
‘‘ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ పరిపాలనలో దేశంలోని పేద రాష్ట్రాల్లో ఒకటిగా ఉండేది. యూపీ ఆర్థిక వ్యవస్థ దేశంలో ఆరు, ఏడు స్థానాల్లో ఉండేది. గత 8ఏళ్ళలో డబుల్ ఇంజన్ సర్కారు నిరంతర కృషి వల్ల దేశంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. 2029 నాటికి యూపీ వంద కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, దేశంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది’’ అని యోగి చెప్పుకొచ్చారు.
ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా గురువారం నాడు 2025-26 సంవత్సరానికి గాను రూ.8,08,736కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఏఐ సిటీ, టెక్నాలజీ రిసెర్చ్ పార్క్ అభివృద్ధి చేయడానికి ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ప్రతిభ, అర్హత కలిగిన విద్యార్ధులకు స్కూటీలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో నాలుగు కొత్త ఎక్స్‌ప్రెస్-వేలు నిర్మించాలని భావిస్తున్నారు. రాష్ట్రంలోని 58 మునిసిపాలిటీలను స్మార్ట్ మునిసిపాలిటీలుగా అభివృద్ధి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు.