బెంగళూరు నగరంలో మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ సమస్యలను రాత్రికి రాత్రి పరిష్కరించలేమంటూ ఉప ముఖ్యమంత్రి శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా, ఏం చేశారంటూ స్థానికులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. మెట్రో విస్తరణ తీవ్ర జాప్యం చేయడం, పుట్‌పాత్‌లు కూడా సరిగా లేకపోవడంపై నగర వాసులు సోషల్ మీడియా వేదికగా మంత్రి శివకుమార్‌పై విరుచుకుపడ్డారు.
రాత్రికి రాత్రి అభివృద్ధిని ఎవరూ కోరుకోవడం లేదని బ్రాండ్ బెంగళూరు పేరుతో అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోందని గుర్తుపెట్టుకోవాలంటూ స్థానికులు మంత్రికి చురకలు వేశారు. ప్రణాళికాబద్దంగా పనిచేస్తే బెంగళూరును అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దవచ్చంటూ ప్రముఖ ఆర్థిక వేత్త మోహన్‌దాస్ పాయ్ విమర్శలు గుప్పించారు. రోడ్ల విస్తరణ, మెట్రో రెండో దశ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదని ఆయన ధ్వజమెత్తారు.
నగరంలో పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థ పెరగడం లేదని పాయ్ గుర్తుచేశారు. చేయాలనే తప్పన ఉంటే పనులు చకచకా జరిపించవచ్చన్నారు. వెంటనే 5 వేల ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలని సూచించారు. మౌలిక సదుపాయాలు కల్పించడానికి దశాబ్దాల సమయం అవసరం లేదని ఆయన గుర్తుచేశారు. బ్రాండ్ బెంగళూరు అంటూ ప్రచారం చేసుకుని చివరకు నగరాన్ని మురికికూపంగా మార్చారంటూ బీజేపీ నేత మోహన్‌కృష్ణ విమర్శించారు.