తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ రాజకీయ ప్రేరేపణతో లేనిపోని ఆందోళనలను సృష్టిస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. ఏ రాష్ట్రం మీదా ఏ భాషనూ జాతీయ విద్యా విధానం 2020 రుద్దడం లేదని స్పష్టం చేసారు.
‘‘ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. ఏదైనా ఒక రాష్ట్రపు విద్యార్ధుల మీద ఏదైనా భాషను బలవంతంగా రుద్దాలని జాతీయ విద్యా విధానం ఎలాంటి సిఫారసూ చేయలేదు. దానర్ధం, తమిళనాడులో హిందీ నేర్పించాలి అని ఎన్ఇపి సిఫార్సు చేయలేదు’’ అని ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసారని సామాజిక మాధ్యమాల ద్వారా తెలిసింది. ఆయన మంచి ఉద్దేశంతో ఆ లేఖ రాయలేదు. ఆయన కొన్ని విషయాలు ఊహించేసుకుని, వాటిపై ఆందోళన చెందుతున్నట్లు ఆ లేఖ రాసారు. ఆ ఉత్తరమంతా రాజకీయ ప్రేరేపితమే. తన రాజకీయ సౌకర్యం కోసమే ఆయన అలా రాసుకొచ్చాడు’’ అని ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు.
‘‘జాతీయ విద్యా విధానం 2020 మౌలిక స్వభావం దేశీయ మూలాలు, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన చదువును మన పిల్లలకు అందించడమేనని స్పష్టం చేసారు. తమిళనాడు లాంటి రాష్ట్రాల భాషా సాంస్కృతిక వారసత్వాన్ని నూతన విద్యా విధానం ప్రోత్సహిస్తోంది. భారత ప్రభుత్వం అన్ని ప్రవేశ పరీక్షలనూ దేశంలోని ప్రధానమైన 13 భాషల్లోనూ నిర్వహిస్తోంది. వాటిలో తమిళం కూడా ఉంది’’ అని ఆయన వివరించారు.
‘‘సింగపూర్‌లో భారతదేశపు మొట్టమొదటి తిరువళ్ళువర్ సాంస్కృతిక కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. అది మా నిబద్ధత. 1968 నుంచీ దేశంలో విద్యారంగంలో ఒక భాషాసూత్రాన్ని అమలు చేసాయి. ఇప్పుడు ఎన్ఇపి 2020ని అమలు చేయకపోవడం ద్వారా మనం విద్యార్ధులకు అంతర్జాతీయ అవకాశాలను తొక్కేస్తున్నాం. తద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను నిరుత్సాహపరుస్తున్నాం. చదువును రాజకీయం చేయకూడదు. వాళ్ళకు కేంద్రం అన్నిరకాల సహకారమూ అందిస్తోంది’’ అని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.
‘‘శాస్త్రీయ విద్య, తమిళంలో బోధనా పద్ధతుల మీద దృష్టి సారించిన ప్రధానమంత్రి శ్రీ స్కూల్స్‌ను అమలు చేయకుండా తమిళనాడు ప్రభుత్వం రూ.5వేల కోట్లను వదిలేస్తోంది. నూతన విద్యా విధానం, విద్యార్ధులకు ఎనిమిదో తరగతి వరకూ మాతృభాషలో బోధించడాన్ని ప్రోత్సహిస్తోంది’’ అన్నారు.
‘‘దేశంలోని అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయడానికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ విషయాన్ని స్టాలిన్ తెలుసుకోవాలి. ప్రత్యేకించి, తమిళ సాహిత్యం, భాష అంటే ప్రధానమంత్రి ఎంతో గర్వకారణంగా భావిస్తారు’’ అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకొచ్చారు.
తమిళనాడు రాష్ట్రానికి ‘సమగ్ర శిక్ష’ నిధులు విడుదల చేయాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసారు. జాతీయ విద్యా విధానం 2020లో పేర్కొన్నట్లు త్రిభాషా సూత్రాన్ని అమలు చేయకపోతే తమిళనాడుకు సమగ్ర శిక్ష నిధులు రావని ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటన చేసారని ఆ లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆ లేఖకు స్పందిస్తూ, లేని సమస్యను అతిగా ఊహించుకుని స్టాలిన్ ఆందోళన చెందుతున్నారని ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు.