కేరళలో విశ్వవిద్యాలయం ఆవరణలో ర్యాగింగ్ పేరిట హింసకు పాల్పడిన మరో సంఘటనతో ఎస్ఎఫ్ఐ మళ్ళీ వార్తల్లోకెక్కింది. తాజాగా తిరువనంతపురంలో కేరళ యూనివర్సిటీ కరియవత్తం క్యాంపస్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసారు తప్ప ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. రాష్ట్రంలో అధికార సీపీఐ(ఎం) అనుబంధ విద్యార్ధి విభాగం ఎస్ఎఫ్ఐకి చెందిన వారే నిందితులు కావడంతో వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
బిన్స్ జోస్ అనే విద్యార్ధి బయోకెమిస్ట్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఫిబ్రవరి 11న అతన్ని ఎస్ఎఫ్ఐ నాయకులు అలాన్, ఆనందం వేలు, శ్రావణ్, సల్మాన్, ఇమాన్యుయెల్, పార్ధన్ అనే ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా హింసించారు. బాధితుడి ఫిర్యాదుతో కళాశాల యాజమాన్యం నిందితులను సస్పెండ్ చేసింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసారు తప్ప ఎవరినీ అరెస్ట్ చేయలేదు. అదేరోజు, బిన్స్ జోస్ స్నేహితుడు అభిషేక్ మీద కూడా సీనియర్ విద్యార్ధులు దాడి చేసి గాయపరిచారు.
ఆ గ్యాంగ్ మొదట అభిషేక్ కోసమే వెళ్ళారు. ఆ సమయానికి అభిషేక్ లేకపోవడంతో బిన్స్ జోస్పై దాడి చేసారు. అతను తమను సరిగ్గా గౌరవించలేదనే వంకతో చితకబాదారు. అతన్ని క్యాంపస్ ఆవరణలోని ఎస్ఎఫ్ఐ రూమ్‌కు తీసుకుని వెళ్ళారు. అక్కడ అతనితో బలవంతంగా మోకాళ్ళు వేయించి, భౌతిక దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన జోస్ దాహంతో మంచినీళ్ళు అడిగితే ఉమ్మి వేసిన నీళ్ళు ఇచ్చి బలవంతంగా తాగించారు. అతన్ని క్రికెట్, హాకీ బ్యాట్లతో చితగ్గొట్టారు. అలా గంటకు పైగా సమయం అతన్ని చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత వదిలిపెడుతూ తమపై ఫిర్యాదు చేస్తే మరింత హింసను చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అయినప్పటికీ బిన్స్ జోస్ కళాశాల ప్రిన్సిపాల్‌కు, స్థానిక పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేసాడు. అభిషేక్ తాను ముందు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నా, జోస్ మాత్రం వదల్లేదు. అతని ఫిర్యాదును ప్రిన్సిపాల్ కళాశాలలోని యాంటీ ర్యాగింగ్ కమిటీకి అందజేసారు. ఆ కమిటీ కూడా మొదట్లో నిందితులను రక్షించడానికి ప్రయత్నించింది. అయితే విద్యార్ధుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబకడంతో కమిటీ వెనక్కి తగ్గింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించింది, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. చివరికి ర్యాగింగ్ జరిగిందని నిర్ధారించింది.
మరోవైపు, పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేసినప్పటికీ ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టులు చేయలేదు. క్యాంపస్ ఆవరణల్లో ఎస్ఎఫ్ఐ గూండాల ర్యాగింగ్ సంఘటనల జాబితాలో మరో సంఘటన పెరిగింది. కేరళ విద్యాసంస్థల్లో మితిమీరిన హింసాకాండకు, భయోత్పాతానికీ నిదర్శనంగా నిలిచింది.
కొద్దిరోజుల క్రితమే కేరళలో ఒక ర్యాగింగ్ సంఘటన దేశమంతా సంచలనంగా నిలిచింది. కొట్టాయంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న ఐదుగురు విద్యార్ధులు, మొదటి యేడాది చదువుతున్న విద్యార్ధులను రెండునెలలుగా తీవ్రంగా ర్యాగింగ్ చేస్తున్నారు. వారు జూనియర్ల నుంచి డబ్బులు వసూలు చేసారు, శారీరకంగా హింసించారు. మర్మాంగాలకు డంబెల్స్ కట్టారు, కంపాస్‌తో ఒంటిమీద తూట్లు పొడిచారు. ఆ సంఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసారు. విచారణ జరుగుతున్న పద్ధతులపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.