భారత మూలాలున్న కాష్ పటేల్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా కాష్ పటేల్ ను నియమించారు. అందుకు సంబంధించిన తీర్మానానికి సెనెట్ 51-49 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ ను ఎంపిక చేశారు. అయితే కొన్ని కీలక పదవుల విషయంలో సెనెట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. తాజాగా సెనేట్ లో ఓటింగ్ నిర్వహించి నియామకాన్ని అధికారికంగా ధ్రువీకరించారు.
రిపబ్లికన్లకు మెజార్టీ ఉన్న సెనేట్‌లో ఓటింగ్ నిర్వహించగా ఇద్దరు సెనేటర్లు పార్టీ విప్ ధిక్కరించి కాష్ పటేల్ కు వ్యతిరేకంగా ఓటేశారు. డెమోక్రాట్లు కూడా పటేల్ నియమాకంపై అభ్యంతరం తెలిపారు. కేవలం రెండు ఓట్ల తేడాతో ఆయన నియామకానికి ఆమోదం లభించింది.
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియామకం అనంతరం ట్విట్టర్ అకౌంట్ లో స్పందించిన కాష్ పటేల్, అమెరికన్లు గర్వపడేలా ఎఫ్‌బీఐని తీర్చిదిద్దుతానని అన్నారు. అమెరికన్లకు హాని చేయాలని చూస్తే వారు ఎక్కడున్న వదలిపెట్టమన్నారు. డైరక్టర్ గా తన లక్ష్యం చాలా స్పష్టంగా ఉందన్నారు.
కాష్ పటేల్ ప్రవాస భారతీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన కుటుంబం గుజరాత్ నుంచి అమెరికా వెళ్లింది. ఆయన పూర్తి పేరు కశ్యప్ ప్రమోద్ వినోద్ పటేల్. 1980లో జన్మించిన కశ్యప్ యూనివర్శిటీ కాలేజ్ లండన్ నుంచి ఇంటర్నేషనల్ లా చదివారు. ట్రంప్ మెుదటిసారి అధ్యక్షుడైనప్పుడు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కౌంటర్ టెర్రరిజం విభాగానికి సీనియర్ డైరెక్టర్‌గా పనిచేశారు.