మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి ఎ.రామ్మోహన్‌నాయుడు సమావేశం నిర్వహించారు. క్వింటాకు రూ.11600 కన్నా ఎక్కువగా మద్దతు ధర ఉండేలా నిర్ణయం తీసుకోవాలని మంత్రి సూచించారు. మార్కెట్లో ధరలు పతనం అయినప్పుడు కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా సరుకు కొనుగోలు చేస్తుంది. అయితే మద్దతు ధరపై 25 శాతం సీలింగ్ ఉంది. దీన్ని 75 శాతానికి పెంచేందుకు అధికారులు అంగీకరించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
ఏపీలో 5 లక్షల ఎకరాల్లో మిర్చి సాగవుతోంది. 12 లక్షల టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నారు. ధరలు పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం మద్దతు ధర పెంచి మిర్చి కొనుగోళ్లు చేసేందుకు రావాలంటూ సీఎం చంద్రబాబునాయుడు గురువారం నాడు కేంద్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులను కోరారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అందుబాటులో లేకపోవడంతో సీఎం చంద్రబాబునాయుడు ఉన్నతాధికారులకు సమస్యను వివరించారు. ఇవాళ ఉదయాన్నే సమావేశమై అధికారులు మిర్చికి మద్దతు ధర పెంచేందుకు అంగీకరించారు.
మిర్చి కొనుగోళ్లకు ఎంత ధర నిర్ణయిస్తారు అనేది తేలాల్సి ఉంది. ఎగుమతులపై కూడా నిర్ణయం వెలువడాల్సి ఉంది. వ్యాపారులతో అధికారులు చర్చలు జరపనున్నారు. ఎగుమతులు పెంచడం ద్వారా కూడా ధరలు పెరిగేలా చర్యలు ప్రారంభించారు. రెండు మూడు రోజుల్లోనే దీనిపై కీలక నిర్ణయం రానుంది.