కరుడుగట్టిన నేరస్తుడు హషీం బాబా భార్య జోయా ఖాన్‌ను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి కోటి విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. జోయాఖాన్ భర్త హషీంబాబాపై డజన్ల కొద్దీ మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా, హత్య కేసులు ఉన్నాయి. ప్రస్తుతం అతను తిహార్ జైల్లో ఉన్నాడు. హషీం బాబా జైలుకు వెళ్లాక నేర సామ్రాజ్యాన్ని జోయాఖాన్ నడిపిస్తోంది. అయితే సరైన సాక్ష్యాలు లభించకపోవడంతో ఆమెను అరెస్ట్ చేయడం సాధ్యం కాలేదు. నిఘా వేసిన పోలీసులు ఎట్టకేలకు హెరాయిన్ సహా జియాఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తర ఢిల్లీలో విలాసవంతమైన జిమ్ యజమాని నాదిర్ షా హత్య కేసులో షూటర్లకు జియాఖాన్ ఆశ్రయం కల్పించినట్లు పోలీసులు చెబుతున్నారు. నాలుగేళ్ల కిందట నాదిర్ షా హత్య జరిగింది. ఆ తరవాత హషీం బాబాను పోలీసులు అరెస్ట్ చేసి జైలు తరలించారు. అనంతరం బాబాను జైల్లో తరచూ ములాఖత్ అవుతోన్న జియాఖాన్ నేరాలను కొనసాగిస్తోంది. బాబా కోడ్ భాషను చక్కగా అమలు చేస్తోంది. తాజాగా ముజఫరాబాద్ నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి విక్రయిస్తుండగా నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు జియాఖాన్‌ను అరెస్ట్ చేశారు.
హషీం బాబా నేర సామ్రాజ్యం ద్వారా 3 వేల కోట్ల ఆస్తులు పోగేశాడని తెలుస్తోంది. దావూద్ తరహాలో ఢిల్లీలో మాదకద్రవ్యాల విక్రయం, సెటిల్మెంట్లు, హత్యలు, భూ కబ్జాలతో రెచ్చిపోయిన హషీం బాబాను ఎట్టకేలకు పోలీసులు జైలు ఊచలు లెక్కపెట్టేలా చేశారు. ఆ తరవాత బాబా భార్య జియాఖాన్ నేరాలు కొనసాగించింది. ముఠాలను పెంచి పోషించింది. దీంతో పోలీసులు నిఘా వేసి ఆమె ఆట కట్టించారు.