విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. వచ్చే ఏడాది కూడా విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం లేదు. ఒక్క పైసా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నియంత్రణ మండలి కొత్త టారిఫ్‌కు ఆమోదం తెలిపింది. తిరుపతిలో సమావేశమైన విద్యుత్ నియంత్రణ మండలి ఇంఛార్జి ఠాగూర్ రాంసింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం 57544 కోట్లు అవసరమని నియంత్రణ మండలి తేల్చింది. విద్యుత్ విక్రయాల ద్వారా 44323 కోట్ల ఆదాయం అంచనా వేశారు. మిగిలిన లోటును చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ప్రజలపై ఎలాంటి భారం మోపకుండానే కొత్త టారిఫ్ ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది.
విద్యుత్ విక్రయాలు, ఆదాయం మధ్య 14 వేల కోట్లకుపైగా వ్యత్యాసం ఉంది. ఇందులో 2 వేల కోట్లు గత ఏడాది ప్రసార, పంపిణీకి భర్తీ చేశారు. మిగిలిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ మండలికి చెల్లిస్తుంది. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాకు రూ.9700 కోట్లు, ఆక్వా రంగానికి రూ.1300 కోట్ల రాయితీలు ప్రభుత్వం చెల్లించనుంది.
విద్యుత్ లోడుకు మించి వినియోగించుకునే వారు 50 శాతం ఛార్జీలు చెల్లించి క్రమబద్దీకరించుకునే అవకాశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీల మొత్తం రూ.1600 కోట్లు నియంత్రణ మండలికి చెల్లిస్తారు. దీంతో కొత్త టారిఫ్ ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది. వినియోగదారులపై ఎలాంటి భారీ మోపకుండానే కొత్త టారిఫ్ ప్రకటించడం హర్షణీయం. బొగ్గును రోడ్డు, సముద్ర, రైలు మార్గాల ద్వారా కొనుగోలు చేసుకునేందుకు ధర్మల్ కేంద్రాలకు స్వేచ్ఛను కల్పించారు. దీని ద్వారా నాణ్యమైన బొగ్గు కొనుగోలు చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. దీని ద్వారా నాణ్యమైన విద్యుత్ తక్కువ ధరకు అందుబాటులోకి వస్తుంది.