ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా, రేఖా గుప్తాతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎన్డీయే నేతలు చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ సహా వందలాది ప్రముఖులు హాజరయ్యారు. వేలాది మంది బీజేపీ నాయకులు,కార్యకర్తల సమక్షంలో రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం చేశారు.
రెండున్నర దశాబ్దాల తరవాత బీజేపీ కల నెరవేరింది. ఢిల్లీ గడ్డపై బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి సారి గెలిచిన ఓబీసీ మహిళకు సీఎం అవకాశం కల్పించడం ద్వారా బీజేపీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. రాజస్థాన్‌లోనూ సీనియర్ బీజేపీ నేత వసుంధరే రాజేను కాదని కొత్త వారికి సీఎం అవకాశం కల్పించారు. దేశంలో 14 రాష్ట్రాల్లో మహిళా సీఎం ఎవరూ లేరనే లోటు ఢిల్లీ పీఠంపై మహిళకు అవకాశం కల్పించడంతో తీరిపోయింది.
రేఖాగుప్తాకు బీజేపీలో మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. డిగ్రీ చదువుకునే రోజుల్లోనే ఆమె ఏబీవీపీలో చురుగ్గా పనిచేశారు. ఆ తరవాత ఆమె న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి పేరు సంపాదించారు. ఢిల్లీ స్థానిక ఎన్నికల్లోనూ పనిచేశారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖాగుప్తా బీజేపీ పక్ష సమావేశానికి హాజరయ్యే సమయంలోనూ ఆమెకు విషయం చెప్పలేదు. 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు నేతగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆమెకు విషయం అర్థమైంది. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పలువురు మహిళలు సేవలందించారు. ఢిల్లీ సదుపాయాలు మెరుగుపరిచి అంతర్జాతీయంగా మరింత గుర్తింపు తీసుకువస్తానని రేఖాగుప్తా ప్రకటించారు.