జమ్మూకశ్మీర్ బారాముల్లా జిల్లా సోపోర్‌లో మైనర్ బాలురను రేప్ చేసిన కేసులో మౌల్వీ ఐజాజ్ షేక్‌కు 14ఏళ్ళ కఠిన కారాగార శిక్ష పడింది. ప్రార్థనలతో ఆరోగ్యం బాగుచేస్తానంటూ ప్రజలను మోసం చేస్తున్న మౌల్వీ ఐజాజ్ షేక్‌ను స్థానికులు పీర్ సాహిబ్ అని పిలుచుకుంటారు. ఇద్దరు బాలురిపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడని మౌల్వీ ఐజాజ్ షేక్ మీద కేసు నిరూపణ అయింది. దాంతో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వజాహత్ మీర్ శిక్ష విధించారు. 14ఏళ్ళ జైలుశిక్షతో పాటు రూ. లక్ష జరిమానా విధించారు. అంతేకాక, బాధిత బాలురు ఇద్దరికీ చెరో 45వేలు చెల్లించాలని ఆదేశించారు.
ఈ నకిలీ మౌల్వీ ఇప్పటికే అరెస్టయి జైల్లో ఉన్నందున అతని బాధితులు మరింతమంది బైటకు వస్తున్నారు. దానివల్ల మరిన్ని ఎఫ్ఐఆర్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ మౌల్వీ మీద ఇప్పటికే మరిన్ని కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.
మౌల్వీ ఐజాజ్ మీద కేసు తొమ్మిదేళ్ళ క్రితం నమోదయింది. బారాముల్లా జిల్లా సోపోర్ తెహసీల్‌లో ఒక వ్యక్తి, తన 15ఏళ్ళ కుమారుడిపై మౌల్వీ ఐజాజ్ షేక్ అలియాస్ పీర్ సాహిబ్ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేసారు. ఆ అబ్బాయిపై అంతకుముందు కొన్నేళ్ళ నుంచీ మౌల్వీ అత్యాచారం చేస్తూ ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేసారు. అబ్బాయిని మెట్రిక్ పరీక్షలో మంచి మార్కులతో పాస్ అయేందుకు సాయం చేస్తానని చెప్పి, చదువుపై ఏకాగ్రత పెంచుతానని మౌల్వీ హామీ ఇచ్చాడు. తనకు అసాధారణమైన మానవాతీత శక్తులు ఉన్నాయని, వాటిద్వారా తాను ఆత్మలను లొంగదీసుకున్నాననీ, వాటి సాయంతో రోగాలను నయం చేస్తాననీ ఈ మౌల్వీ ప్రచారం చేసుకునే వాడు. రోగం నయం చేయించుకోవాలి అనుకునే పిల్లలను అక్కడ రాత్రి ఒంటరిగా వదిలిపెట్టాలంటే భయమవుతోందని , వారి తల్లిదండ్రులు చెప్పారు.
ఫిర్యాదు చేసిన వ్యక్తి మరిన్ని అనుమానాలు వ్యక్తం చేసాడు. పీర్ సాహిబ్ మరింత మంది పిల్లలపైనా అలాంటి అత్యాచారాలకు పాల్పడి ఉంటాడని భావించాడు. జీనీల (దెయ్యాలు) పేరుతో పిల్లలను మభ్యపెట్టి, వారిని లోబరుచుకుని అకృత్యాలు చేసి ఉంటాడని అనుమానించాడు.
ఐజాజ్ ఖాన్ చిన్నపిల్లలను ఆకట్టుకుందుకు వారికి డబ్బులు ఇచ్చేవాడు. ఒకట్రెండుసార్లు తన దగ్గరకు రావడం అలవాటైన పిల్లల తల్లిదండ్రులకు, ఆ పిల్లలను తన దగ్గర ఒక రాత్రి వదిలేయమని చెప్పేవాడు. పిల్లలకు పట్టిన దయ్యాలను వదిలించడం రాత్రే అవుతుందని చెప్పేవాడు. అలా పన్నెండేళ్ళ వయసు కలిగిన మగపిల్లలకు పీర్ సాహిబ్ దగ్గర కష్టాలు మొదలయ్యేవి. వాళ్ళ నోళ్ళు మూసి వారితో అసహజ రతి చేయడం ద్వారా వారిపై అత్యాచారాలకు పాల్పడేవాడు. అలా, పిల్లలను భయపెట్టి లొంగదీసుకుని ఏళ్ళ తరబడి వారిపై అత్యాచారాలు చేస్తున్నాడు.
ఒక బాబు మూడేళ్ళుగా ఈ మౌల్వీ దగ్గర లైంగిక వేధింపులకు గురవుతున్నాడు. ఒకరోజు తండ్రి ఆ బాలుడి తమ్ముణ్ణి కూడా మౌల్వీ దగ్గరకు పంపిస్తానని చెప్పినప్పుడు, తను పడుతున్న వేధింపులు తమ్ముడు పడకూడదని భావించి ఆ చిన్నారి తన తండ్రికి జరుగుతున్న అత్యాచారాల గురించి చెప్పాడు. అలా ఈ మౌల్వీ విషయం బైటకు వచ్చింది. సదరు నకిలీ మౌల్వీ మీద మొదటి సారి ఫిర్యాదు నమోదయింది.