శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండోరోజుకు చేరాయి. మొదటి రోజు బుధవారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. రాత్రి 7 గంటలకు భేరీ పూజ, భేరీ తాడనం చేసి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించారు. అనంతరం ధ్వజపటాన్ని ఆవిష్కరించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.
నేడు ఆదిదంపతులకు భృంగి వాహనసేవ…
బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు అయిన నేటి రాత్రికి శ్రీభ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున స్వామి వార్లు భృంగివాహనంపై నుంచి భక్తులను అనుగ్రహిస్తారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహిస్తారు.
పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సు …
మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ శ్రీశైలానికి ప్రత్యేక బస్సు నడుపుతుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేషగిరిరావు తెలిపారు. 18 సీట్లున్న మినీ ఏసీ బస్సు ఈనెల 25న సాయంత్రం ఆరు గంటలకు రాజమహేంద్రవరం నుంచి విజయవాడ మీదుగా శ్రీశైలం చేరుకోనుంది. 26న ఉదయం శ్రీశైలం చేరుకుంటుంది. టిక్కెట్ ధర పెద్దలకు రూ.4,360, పిల్లలకు రూ.3,490గా నిర్ణయించారు. తిరుగు ప్రయాణంలో త్రిపురాంతకం మీదుగా 27న తెల్లవారుజామున రెండింటికి విజయవాడ, ఉదయం ఆరుగంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటుంది. మరిన్ని వివరాలకు 9848629341, 9848007025 నంబర్లలో సంప్రదించాలని కోరారు.