భారత నౌకాదళానికి చెందిన కీలకమైన సమాచారంపై విశాఖపట్నంలో గూఢచర్యం చేసిన కేసుకు సంబంధించి, పాకిస్తాన్ ఐఎస్ఐకు సంబంధమున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ అరెస్ట్ చేసింది. నిందితులను కర్ణాటక, కేరళల్లో ఫిబ్రవరి 18న అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది.
వేత్తన్ లక్ష్మణ్ తండేల్, అక్షయ్ రవి నాయక్ అనే ఇద్దరిని కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోను, అభిలాష్ పిఏ అనే నిందితుణ్ణి కేరళలోని కొచ్చిలోను నిర్బంధించినట్లు ఎన్ఐఏ ఒక ప్రకటనలో వెల్లడించింది. దాంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరుకుంది.
తాజాగా అరెస్టు చేసిన ముగ్గురూ పాకిస్తాన్ ఇంటలిజెన్స్ ఆపరేటివ్స్‌తో (పీఐఓలు) సామాజిక మాధ్యమాల ద్వారా కాంటాక్ట్‌లో ఉన్నారని ఎన్ఐఏ వెల్లడించింది.
‘‘కార్వార్ నేవల్ బేస్, కొచ్చి నేవల్ బేస్‌లలోని భారత రక్షణ వ్యవస్థల గురించి రహస్యమూ, కీలకమూ అయిన సమాచారాన్ని వారు షేర్ చేస్తున్నారు. దానికిగాను పీఐఓలు వీరికి డబ్బులు చెల్లిస్తున్నారు’’ అని ఎన్ఐఏ తెలియజేసింది.
ఎన్ఐఎ ఇప్పటికి ఈ కేసులో ఐదుగురి మీద ఛార్జిషీట్ దాఖలు చేసింది. వారిలో ఇద్దరు పరారైన పాకిస్తానీ ఆపరేటివ్స్. ఈ కేసును మొదట 2021 జనవరిలో ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటలిజెన్స్ సెల్ రిజిస్టర్ చేసింది. 2023 జూన్‌లో ఈ కేసును ఎన్ఐఏకు బదలాయించారు. ఎన్ఐఏ దర్యాప్తు తర్వాత ‘‘ఆకాష్ సోలంకీ నిందితుడు, పాకిస్తానీ జాతీయుడు మీర్ బలాజ్ ఖాన్ భారత వ్యతిరేక కుట్రలో భాగంగా భారత నౌకాదళానికి సంబంధించిన కీలకమైన గోప్యమైన సమాచారాన్ని లీక్ చేసే గూఢచర్య రాకెట్‌లో భాగస్వాములుగా ఉన్నారు. ఆకాష్ సోలంకీ అనే నిందితుడు అరెస్ట్ అయాడు’’ అని వెల్లడైంది.
మీర్ బలాజ్ సోలంకీతో పాటు ఎన్ఐఏ మరో పాకిస్తానీ ఇంటలిజెన్స్ ఆపరేటివ్ అల్వేన్ మీద, మన్మోహన్ సురేంద్ర పాండా, అమాన్ సలీం షేక్ అనే మరో ఇద్దరి మీదా ఛార్జిషీట్ దాఖలు చేసింది.