ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా త్రివేణీసంగమం వద్ద ఇస్రో మాజీ ఛైర్మన్ ఎస్ సోమనాథ్ పవిత్ర స్నానం ఆచరించారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం చేసిన సోమనాథ్ దాన్నొక గొప్ప ఆధ్యాత్మిక అనుభవంగా పేర్కొన్నారు. ‘‘విశ్వంతో సంబంధం కోసం, అమృతాన్ని సాధించడం కోసం మానవాళి చేసిన అన్వేషణే మహాకుంభమేళా. సాధుసంతులతో కలిసి త్రివేణీ సంగమంలో స్నానం చేయడం ఆనందకరమైన అనుభవం’’ అని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేసారు.
బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి కూడా ఇవాళ త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ‘‘కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు స్నానమాచరించేందుకు ప్రయాగరాజ్ వస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళాలో పాల్గొనడానికి వస్తున్న భక్తుల కోసం అనేక ఏర్పాట్లు చేసింది. ప్రయాగరాజ్ చేరుకోగానే భక్తి పారవశ్యం ముంచెత్తుతోంది. మహాకుంభమేళా సందర్భంగా త్రివేణీ సంగమంలో స్నానం ఆచరించే భాగ్యం కలగజేసినందుకు భగవంతునికి కృతజ్ఞతలు’’ అంటూ పురందరేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు.