కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. వ్యవసాయదారులకు పెట్టుబడి సాయం కింద అందించే పీఎం కిసాన్ పథకం సాయం 19వ విడత నిధుల విడుదల తేదీలు ఖరారు చేసింది. ఫిబ్రవరి 24న రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమైంది. బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిధులు విడుదల చేయనున్నారు. 19వ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనున్నట్లు అధికారులు లెక్కలతో వివరించారు.
పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే రైతులు ఎన్‌పీసీఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతా కలిగి ఉండటంతో పాటు ఈ-కేవైసీ చేసి ఉండాలి. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి స్టేటస్, జాబితాలో పేరు ఉందో లేదో చూడడానికి పీఎం కిసాన్ ప్రభుత్వ వెబ్ సైట్‌లోకి వెళ్లి తనిఖీ చేసుకోవాలి. రిజిస్టర్డ్ మొబైల్, ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. పీఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది.