హిందూ నాయకులను అల్పులుగానూ, ఇస్లామిక్ ఆక్రమణదారులను మహానుభావులుగానూ చిత్రీకరించి, కుహనా లౌకికవాద చరిత్రకారులు ప్రజల్లో స్వదేశీ నాయకులపై తక్కువ భావం కలిగించేలా చరిత్రను నిర్మించారు. 1947 నుంచి 1975 వరకూ భారతదేశ విద్యాశాఖ మంత్రులుగా చేసినవారిలో అత్యధికులు ముస్లిములే. భారతదేశ చరిత్ర పాఠ్యపుస్తకాలు వారి కనుసన్నలలోనే రూపొందాయి. అలాంటి చరిత్రకారులు శివాజీని హిందుత్వం కోసం పోరాడిన వాడిగా కాకుండా సామాజిక న్యాయం కోసం పోరాడిన లౌకికవాదిగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. శివాజీ సైన్యంలో పెద్దసంఖ్యలో ముస్లిములు ఉన్నారన్న తప్పుడు అపోహలను సృష్టించినది కూడా ఆ నకిలీ చరిత్రకారులే. మరి వాస్తవాలేమిటో చూద్దాం. శివాజీ సనాతన ధర్మానికి పూర్వవైభవాన్ని పునరుద్ధరించడం కోసం కష్టపడ్డారు. హిందువుల కోసం హిందువుల్లో ఐకమత్యం తీసుకురావడానికి పాటుపడ్డారు. శివాజీ హిందువు కాబట్టే ఆయన ఏ మతాన్నీ కించపరచలేదు. అదే సమయంలో హిందువులకు, వారి గొప్ప సంస్కృతికీ జరుగుతున్న అన్యాయాలను వ్యతిరేకించారు, వాటిపై పోరాడారు.
ఛత్రపతి శివాజీ గురించి స్వామి వివేకానంద ఏమన్నారు?
‘‘గత మూడు శతాబ్దాల్లో భారతదేశం సృష్టించిన అతిగొప్ప రాజు ఎవరంటే ఆయన శివుడి అపర అవతారమే. ఆయన పుట్టడానికి చాలాకాలం ముందు నుంచే ఆయన గురించి ఎన్నో జోస్యాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని గొప్ప సాధుసంతులు అందరూ ఆయన జన్మించడం గురించి ఆత్రుతగా ఎదురుచూసారు. మొగలుల విధ్వంసకర పాలనాకాలంలో నాశనమైపోయిన ధర్మాన్ని నిలబెడతాడని, మ్లేచ్ఛుల నుంచి హిందువులను రక్షిస్తాడనీ భావించారు,
అలాంటి శివరాయలు (శివాజీ) కంటె పెద్ద నాయకుడు, సాధువు, భక్తుడు లేక రాజు ఎవరైనా ఉన్నారా? మన ప్రాచీన గ్రంథాల్లో వర్ణించినట్లు, మానవాళి కోసం జన్మించిన మహారాజు శివాజీ. ఆయన భారతదేశపు నిజమైన పుత్రుడు, ఈ దేశపు చైతన్యానికి ప్రతీక. భారతదేశపు భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఆయన చూపించాడు. విభాగాలన్నీ కలిసి ఒకే గొడుగు కింద ఉంటాయి. దేశం ఒక సర్వోత్కృష్టమైన సార్వభౌమ ప్రభుత్వంగా ఉంటుంది.’’
శివాజీ నికార్సైన హిందూ యోధుడు, నకిలీ లౌకికవాది కాడు:
శివాజీ మహరాజ్‌కు అత్యద్భుతమైన ప్రతిభ, విస్పష్టమైన దార్శనికత ఉన్నాయి. అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏకైక వ్యక్తి ఆయనే. శివాజీ వ్యక్తిత్వం స్ఫూర్తిదాయకం, ఆయన మూర్తి ఆకర్షణీయం. ఆయన రాజ్యంలోని సైనికులు, రైతులు ఆయనను అమితంగా గౌరవించేవారు, ఆయనకు విధేయంగా ఉండేవారు, ఆయన కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉండేవారు. స్వరాజ్య సృష్టి కోసం ఆయన… మొగలులను ఎదుర్కోవడం, విదేశీ ఆధిపత్యాన్ని తొలగించడం, ముస్లిం పాలన నుంచి స్వేచ్ఛ పొందడం సాధ్యమే అని ప్రదర్శించడం ద్వారా… హిందువుల్లో నిద్రపోతున్న చైతన్యాన్ని జాగృతం చేయాల్సి వచ్చింది.
దేవాలయాల అభివృద్ధి, హిందూ ఐక్యతను బలోపేతం చేయడం:
ఛత్రపతి శివాజీ మహరాజ్ హిందువుల ఆత్మగౌరవానికి, సంస్కృతికి విశేష ప్రాధాన్యం ఇచ్చారు. మన దేశానికి వచ్చిన విదేశీ ఆక్రమణదారులు ఇక్కడ ఆలయాలను, ఆశ్రమాలను ధ్వంసం చేయడం ద్వారా హిందూ సమాజాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు. ఉదాహరణకి, అయోధ్యలో శ్రీరామజన్మభూమిని బాబర్ ధ్వంసం చేసాడు. కాశీ విశ్వనాథ ఆలయాన్ని, మథుర శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఔరంగజేబు ధ్వంసం చేసాడు. ఆ భవ్య మందిరాల స్థానంలో ముస్లిం ఆక్రమణదారులు నిర్మించిన నిర్మాణాలు హిందువులను తీవ్రంగా గాయపరుస్తూనే ఉన్నాయి. ప్రముఖ చరిత్రకారుడు ఆర్నాల్డ్ టాయన్బీ 1960లో ఢిల్లీలో చేసిన ఒక ప్రసంగంలో ఒక ఆసక్తికరమైన పరిశీలన చేసాడు, ‘‘మీ దేశంలో మిమల్ని అవమానించేలా ఔరంగజేబు నిర్మించిన మసీదులను మీరు భద్రంగా ఉంచారే’’ అని ఆశ్చర్యపోయాడు. 19వ శతాబ్దం ప్రారంభంలో రష్యా పోలండ్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు వార్సా నగర కూడలిలో వారొక రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ నిర్మించారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో పోలండ్ మళ్ళీ స్వతంత్ర దేశమైంది. ఆ వెంటనే ఆ దేశం చేసిన మొదటి పని రష్యా తమ దేశంలో నిర్మించిన చర్చిలను పడగొట్టడం, రష్యా ఆధిపత్యాన్ని గుర్తుచేసే అన్ని చిహ్నాలనూ తొలగించడం. ఎందుకంటే ఆ చర్చి రష్యా చేతితో పోలండ్ వాసులు ఎదుర్కొన్న అవమానాలను నిరంతరం గుర్తుచేస్తూండే చిహ్నం. ఆ కారణానికే భారతదేశంలోని జాతీయవాద సంస్థలు శ్రీరామజన్మభూమి ఉద్యమాన్ని ప్రారంభించాయి.
శివాజీ ఆ పనిని అప్పుడే మొదలుపెట్టారు. గోవాలోని సప్త కోటేశ్వర మందిరం, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం, తమిళనాడులోని సముద్రత్తిర్ పెరుమాళ్ దేవాలయాలను పునరుద్ధరించారు.
‘‘మా దేవాలయాలను కూల్చి, మా సంస్కృతిని అవమానించి, మా ఆత్మగౌరవానికి హాని కలిగిస్తే, వాటిని మేము మరింత దృఢంగా నిర్మించుకుంటాం’’ అని ఛత్రపతి శివాజీ మహరాజ్ తన చర్యల ద్వారా ముస్లిం ఆక్రమణదారులకు ఘాటైన సందేశమిచ్చారు.
మహారాష్ట్రలోని కళ్యాణ్-భివాండీ దగ్గర శివాజీ ఒక మసీదును కూల్చివేసినట్లు కవీంద్ర పరమానంద్ గోవింద్ నెవాస్కర్ రచించిన శివభారతం (18వ అధ్యాయం 52వ శ్లోకం)లో ఉంది. 1678లో జెస్యూట్ మతగురువు ఆంద్రె ఫెయిర్ ఒక లేఖలో శివాజీ మసీదులను ధ్వంసం చేసాడని రాసినట్లు ‘హిస్టారికల్ మిస్లెనీ’ అనే రచనలో ఉంది.
ఒక దేశం నుంచి ధర్మాన్ని, సంస్కృతిని తీసివేయకూడదు. ఆత్మగౌరవాన్ని లాగేసుకోకూడదు. విదేశీ ఆక్రమణదారులు మన ఆత్మగౌరవం మీద దాడి చేస్తే దానికి తగినట్లు ప్రతిస్పందించాలి, మన బానిసత్వపు చిహ్నాలను తుడిచిపెట్టేయాలి, మన ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించుకోవాలి. అదీ శివాజీ మహరాజ్ మనకు నేర్పించిన నీతి.
ఎందరో హిందూ వీరులు పలురకాల ఒత్తిళ్ళ వల్లనో, తమ సుల్తానులను సంతృప్తి పరిచేందుకో ఇస్లాంలోకి మతం మారారు. అటువంటి వారు సనాతన ధర్మంలోకి పునరాగమనం చేయాలని శివాజీ ప్రోత్సహించారు, అలా తిరిగి హిందూ ధర్మంలోకి రావాలనుకున్న వారికి సహాయమూ చేసారు.
శివాజీ పెద్ద కుమారుడు, చరిత్రలో నిలిచిపోయిన గొప్ప వీరుడు శంభూ రాజే, ఒక లేఖలో తన తండ్రిని ‘మ్లేచ్ఛక్షయదీక్షిత’ అని వ్యవహరించాడు. అంటే ముస్లిం ఆక్రమణకారులను నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన వాడు అని అర్ధం. పోర్చుగీసు వారు శివాజీకి లేఖలు రాసేటప్పుడు ‘హిందూ బలగాల సైన్యాధ్యక్షుడికి’ అని సంబోధిస్తూ రాసేవారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ భారతదేశంలో హిందువుల సాంస్కృతిక, రాజకీయ శక్తిని పునరుద్ధరించారు. హిందువులను వేధించడానికి, హింసించడానికీ ప్రయత్నించిన మ్లేచ్ఛులను ఆయన కఠినంగా శిక్షించారు. బలవంతంగా మతం మార్చబడిన వారిని మళ్ళీ సనాతన ధర్మంలోకి తీసుకొచ్చే పనిని ఆయనే మొదలుపెట్టారు. భాషను శుద్ధి చేసి అందులోని పర్షియన్, ఉర్దూ పదాలను తొలగించడానికి ‘పండిట్రావ్’ అనే పదవిని ఏర్పాటు చేసిందీ శివాజీయే.
ఛత్రపతి శివాజీ మహరాజ్, ఛత్రపతి శంభాజీ మహరాజ్ ఇద్దరూ దేవాలయాలకు నిధులు సమకూర్చడం, సాధుసంతులను, హిందూ కార్యక్రమాలను ప్రోత్సహించడం చేసారు.
శివాజీ భావధార:
ముస్లిం ఆక్రమణదారుల గురించి, హైందవ విలువలకు, మానవత్వానికీ విరుద్ధమైన వారి చర్యల గురించి శివాజీ వెలిబుచ్చిన అభిప్రాయాలను చిట్నిస్ అనే రచయిత ‘శివ దిగ్విజయ’ గ్రంథంలో పొందుపరిచారు.
‘‘ముస్లిములను ఆశ్రయించి, వారిపై ఆధారపడి బతకడం, గోవధకు సాక్షులుగా ఉండడం మంచిది కాదు. అంతకంటె చనిపోవడమే మంచిది. హిందూ ధర్మంపై వీసమెత్తు దాడిని, ముస్లిములు పాల్పడే అన్యాయాలను నేను ఎంతమాత్రం సహించను. ఆ కారణం చేత నన్ను నా తండ్రి వదిలిపెట్టేసినా ఫర్వాలేదు. కానీ అలాంటి చోట ఉండడం ఎంతమాత్రం మంచిది కాదు’’ (‘శివ దిగ్విజయం’ నుంచి, పుట 157)
‘‘మనం హిందువులం. వారు యవనులు. వారు దిగువ స్థాయి వారు, నిజానికి అంతకంటె అధమ స్థాయి లేదు. వారికి వందనం చేయడమంటే నాకు అసహ్యం. వారు గోవధ లాంటి దుష్టమైన పనులకు పాల్పడ్డారు. హిందూ మతానికీ, బ్రాహ్మణులకూ వారు చేసిన ద్రోహాలకు సాక్షిగా ఉండడం కూడా తప్పే. మనం రహదారులపై వెడుతుంటే వారు గోవులను చంపేస్తుంటారు. అలాంటివి చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. ఆ నేరం చేసిన వారి తల నరికేయాలనిపిస్తుంది. అలా గోవులను హింసించేవారిని చూసినప్పుడు వాళ్ళకు శిరచ్ఛేదం చేయాలని నా మనసులో అనుకుంటాను. కానీ నేను నిస్సహాయుణ్ణి. నా తండ్రి ఏమనుకుంటాడో నాకు తెలియదు. (‘శివ దిగ్విజయం’ నుంచి, పుట 160)
‘‘కుమారుడికి తండ్రి దైవంలా పరమ పవిత్రమైనవాడు. ఆయన ఆజ్ఞలను గౌరవంతో ఆచరించాలి. కానీ మతం పూర్తిగా పక్కకు నెట్టేయబడింది, ప్రతీ విషయంలోనూ మ్లేచ్ఛులదే ఆధిక్యం. వాళ్ళను పడగొట్టి నా మతాన్ని రక్షించుకోడానికి నేను నా జీవితంతో సహా నాదైన ప్రతీదాన్నీ పణంగా పెట్టాలి. అలాంటప్పుడు నా తండ్రి తన లేఖలో నన్ను చేయమన్న పనిని నేను ఎలా చేయగలను. ఈ మార్గం గౌరవప్రదమైనదని భావించి, నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.’’ (‘శివ దిగ్విజయం’ నుంచి, పుట 171-172)
‘‘మన ధర్మాన్ని (మతాన్ని) పతనం చేసారు. మన దైవాలు, బ్రాహ్మణులను ఇక్కట్ల పాలు చేసారు. ప్రతీచోటా మ్లేచ్ఛులదే ఆధిక్యం. ప్రతీ ఒక్కరినీ అణగదొక్కుతున్నారు. ఈ పరిస్థితిని తొలగించాలన్నదే నా లక్ష్యం. నా ఆలోచన మీకు సమ్మతమైతే, ఖాన్ మనసులో ఏముందో నాకు స్పష్టంగా చెప్పండి. అతని నిజమైన వ్యూహం ఏమిటి? అంతకుమించి నేను మిమ్మల్ని ఏమీ అడగను.’’ (‘శివ దిగ్విజయం’ నుంచి, పుట 187)
‘‘ఢిల్లీ సామ్రాజ్యాన్ని, ఉత్తరభారతదేశాన్ని జయించడానికి నా జీవితం సరిపోదు. నేను స్థాపిస్తున్న రాజ్యాన్ని భవిష్యత్తులో మరింత బలోపేతం చేయాలి. నాకంటె గొప్పగా విస్తరించాలి.’’ (‘శివ దిగ్విజయం’ నుంచి, పుట 248)
ప్రముఖ చరిత్రకారుడు జదునాథ్ సర్కార్ రచించిన ‘శివాజీ అండ్ హిజ్ టైమ్స్’ ప్రకారం శివాజీకి రామాయణ మహాభారత ఇతిహాసాల మీద అమోఘమైన పట్టు ఉంది. చిన్ననాటి నుంచీ ఆ ఇతిహాసాలను కథలుగా వింటూ, వల్లె వేస్తూ పెరిగారు. అందుకే శివాజీ మనసులో చిన్నవయసు నుంచే రామాయణంలో రాముడు, భారతంలో పాండవులూ చూపిన వీరత్వం, త్యాగ గుణం, శౌర్య పరాక్రమాలు, రాజనీతి, రాజకీయ బోధలు, నైతిక ప్రవర్తన బలంగా నాటుకుపోయాయి.
మన దేశ చరిత్రను రాసిన కమ్యూనిస్టు భారతీయ చరిత్రకారులు, విదేశీ రచయితలు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను చులకన చేసి తమ రచనలు సాగించారు. డబ్బు ఆశ, కీర్తి కండూతి, వారి తప్పుడు భావజాలాల కారణంగా వారు శివాజీని తక్కువ చేసి చూపించారు. విదేశీ ఆక్రమణదారుల నుంచి కోట్లాదిమంది ప్రజలను రక్షించిన వీరుడు, అద్భుతమైన నాగరికత కలిగిన రామరాజ్యాన్ని పునరుద్ధరించిన వాడూ అయిన గొప్ప చక్రవర్తి శివాజీ మహరాజ్. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడం, అదే సమయంలో క్రియాశీలంగా అప్రమత్తంగా ఉండడం, సాదాసీదాగా ఉండడం వంటి శివాజీ గొప్ప లక్షణాలను యువతరం నేర్చుకోవాలి. అప్పుడే వ్యక్తిగత అభివృద్ధి, దేశాభివృద్ధి సాధ్యమవుతాయి.