రైతు దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమన్న వైసీపీ అధినేత
గుంటూరులో మిర్చి రైతులకు సంఘీభావం తెలిపిన మాజీ సీఎం
కూటమి ప్రభుత్వ తీరుతో రైతులు కష్టాలు పడుతున్నారని ఆగ్రహం
మిరప ధరలపై సీఎం చంద్రబాబు సమీక్ష…
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితో గురువారం భేటీకానున్న కూటమి ఎంపీలు
ఏపీలో రాజకీయం రూటు మారింది. ఇప్పటి వరకు అమరావతి, అవినీతి, పోలవరం, అధికార దుర్వినియోగం వేదికగా అధికార, విపక్షాల మధ్య పరస్పర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ దఫా ఏపీలో రైతు చుట్టూ తిరుగుతున్నాయి. మిర్చి ధర తగ్గడంతో రైతుల బాధలను వైసీపీ ఎత్తిచూపుతోంది. కూటమి ప్రభుత్వ తీరుతోనే వ్యవసాయదారులు ఇక్కట్లు పడుతున్నారని వైసీపీ చెబుతోంది. రైతు భరోసా అందడం లేదని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైందని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
వైసీపీ కౌంటర్‌కు దీటుగా సమాధానం చెప్పేందుకు కూటమి ప్రభుత్వం కూడా సిద్ధమైంది. మిర్చి రైతులను పరామర్శించేందుకు జగన్ గుంటూరు వెళుతున్నారని తెలియగానే ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రైతులకు అందిస్తున్న ధరలపై కేంద్ర సాయం కోరాలని నిర్ణయించారు. వ్యవసాయ శాఖమంత్రితో గురువారం కూటమి ఎంపీలు భేటీ కానున్నారు.
గుంటూరులో మిర్చి రైతులకు వైఎస్ జగన్ సంఘీభావం
కూటమి ప్రభుత్వ తీరుతో ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడని, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గుంటూరు మిర్చి రైతులకు సంఘీభావం తెలిపిన అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్… ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదన్నారు. రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. వైసీపీ హయాంలో రైతులకు మేలు జరిగిందన్నారు. వైసీపీ హయాంలో రూ.21 వేల నుంచి రూ. 27 వేల ధర లభిస్తే ప్రస్తుతం కనీసం రూ.11 వేలు కూడా గిట్టుబాటు ధర లేదన్నారు.
ఎమ్సెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నా….
వైసీపీ అధినేత జగన్ గుంటూరు పర్యటనకు జిల్లా కలెక్టర్ (జిల్లా ఎన్నికల అధికారి) అనుమతి ఇవ్వలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నింబంధనలు అతిక్రమించి మిర్చి యార్డుకు వస్తే అరెస్ట్ చేస్తామని తెలిపారు. మిర్చి రైతుల పరామర్శకు, ఎన్నికల కోడ్ కు సంబంధం లేదని వైసీపీ, తాము పబ్లిక్ మీటింగులు పెట్టడం లేదని, రైతుల సమస్యలు మాత్రమే వింటున్నామని తెలిపింది.