పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మహాకుంభమేళాను మృత్యుకుంభ్ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించాయి. సనాతన ధర్మం మీద, హిందూ సంప్రదాయాల మీదా మమతా బెనర్జీ చేసిన ప్రత్యక్ష దాడిపై హిందూ సమాజం మండిపడింది. మమత వ్యాఖ్యలను పలువురు నేతలు, సాధారణ హిందువులూ తీవ్రంగా ఖండించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం మాట్లాడుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న కుంభమేళా గురించి వ్యాఖ్యానించారు. కుంభమేళాలో నిర్వహణా లోపాలు ఉన్నాయంటూ దాన్ని ‘మహాకుంభ్ కాదు, మృత్యుకుంభ్’ అని వర్ణించారు. తనకు కుంభమేళా అన్నా, గంగామాత అన్నా గౌరవం ఉన్నాయంటూనే ఆ విమర్శలు చేసారు.
కుంభమేళా నిర్వహణలో సరైన ప్రణాళిక లేదని మమతా బెనర్జీ మండిపడ్డారు. వీఐపీలకు, ధనికులకూ రూ.లక్షతో టెంట్లు ఏర్పాటు చేసారు, కానీ సామాన్యులూ నిరుపేదలకు ఎలాంటి ఏర్పాట్లూ లేవన్నారు. మేళాలో తొక్కిసలాట వంటి పరిస్థితులు సామాన్యమే, కానీ వాటిని ఎదుర్కొనే ఏర్పాట్లు చేయాలి, యూపీ ప్రభుత్వం ఏం ఏర్పాట్లు చేసింది? అని ప్రశ్నించారు.
మమత వ్యాఖ్యలను పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్రంగా ఖండించారు. సువేందు నేతృత్వంలోని బీజేపీ ఎంఎల్ఏలు సభలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా నినాదాలతో సభను హోరెత్తించారు. మమత వ్యాఖ్యలపై హిందువులు, సాధుసంతులు నిరసన బలంగా తెలియజేయాలని సువేందు అధికారి పిలుపునిచ్చారు. ‘‘మీరే నిజమైన హిందువు అయితే, రాజకీయాలకు అతీతంగా స్పందించండి. మమతా బెనర్జీ మాటలను తీవ్రంగా ఖండించండి. హిందూధర్మం మీద, మహాకుంభమేళా మీద దాడికి వ్యతిరేకంగా నోరు విప్పండి’’ అని హిందూ సమాజానికి విజ్ఞప్తి చేసారు.
మమత వివాదాస్పద వ్యాఖ్యలు సనాతన ధర్మం మీద, హిందువుల మీద ఆమె ద్వేషానికి నిదర్శనమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మండిపడ్డారు. ‘‘మమత ఒక్కర్తే కాదు… ఇండీ కూటమిలోని రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్… వాళ్ళందరూ సనాతన ధర్మాన్ని హిందువులను ద్వేషిస్తారు. ఆ విషయాన్ని మమత మహాకుంభ్‌ను మృత్యుకుంభ్ అనడం ద్వారా బహిరంగంగా స్పష్టం చేసింది’’ అని వ్యాఖ్యానించారు.
‘‘దావత్-ఎ-ఇస్లాంను ప్రతిపాదించిన ఫర్హాద్ హకీమ్ ప్రభావం మమతా బెనర్జీ మీద ఉంది. భారతదేశపు సాంస్కృతిక, ధార్మిక సంప్రదాయాలపై తనకున్న గాఢమైన ధిక్కారాన్ని ఆమె మరోసారి బైటపెట్టింది. మహాకుంభ్‌ను మృత్యుకుంభ్ అనడం ద్వారా హిందువుల అత్యంత గౌరవాస్పదమైన తీర్థయాత్ర మీద, శతాబ్దాలుగా కోట్ల మంది ప్రజలు హాజరవుతున్న కుంభమేళా మీద మమతా బెనర్జీ ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడ్డారు. తన ఓటుబ్యాంకును బుజ్జగించడానికి ఏ చిన్న అవకాశాన్నీ మమత వదులుకోదు. అదే హిందువుల ఆచార వ్యవహారాలను మాత్రం ఆమె నీచంగా, నిర్లక్ష్యంగా, శత్రుత్వ ధోరణితో చూస్తారు’’ అని బీజేపీ నాయకుడు అమిత్ మాలవీయ మండిపడ్డారు.
2015లో మక్కాలో తొక్కిసలాట జరిగి 2236 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ మృతుల్లోని బెంగాల్ వాసులకు మమతా బెనర్జీ రూ.10లక్షల పరిహారం ప్రకటించింది. ఇప్పుడు మహాకుంభ్‌లో తొక్కిసలాట జరిగి 30మంది చనిపోతే దాన్ని మాత్రం మృత్యుకుంభమేళా అంటోంది. మమతా బెనర్జీ హిందూద్వేషానికి, సనాతన వ్యతిరేకతకూ ఇది నిదర్శనం.