క్రికెట్ లో వన్డే ప్రపంచకప్ తర్వాత అత్యంత ఆసక్తి రేపే ఛాంపియన్స్ ట్రోఫీ సమరం పాకిస్తాన్ వేదికగా కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ టోర్నీ దాదాపు 8 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతోంది. పాకిస్తాన్ లో 1996 తర్వాత ఐసీసీ టోర్నీ జరగడం ఇదే మొదటిసారి. పాకిస్తాన్ వెళ్లేందుకు భారత్ నిరాకరించింది. దీంతో భారత్ ఆడే మ్యాచ్ లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి.
అయితే టోర్నీ ప్రారంభానికి ముందు భారత్ పై పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కింది. టోర్నీలో పాల్గొనే దేశాల జాతీయ జెండాలన్నిటినీ కరాచీలోని నేషనల్ స్టేడియంపై ఎగురవేసింది. భారత జెండాను ఎగురవేయలేదు. భారత్ తమ దేశంలోకి అడుగుపెట్టడంలేదు కాబట్టే ఆ దేశ జెండాను పెట్టలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెబుతోంది.
సామాజిక మాధ్యమాల్లో ఈ వివక్షను పలువురు ఎండగట్యంటారు. భారత్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో పాకిస్తాన్ దిగివచ్చి భారత త్రివర్ణ పతాకాన్ని స్టేడియంపై ఏర్పాటు చేసింది.
టోర్నీలు జరిగే రోజుల్లో నాలుగు జెండాలు మాత్రమే ఎగురవేయాలని ఐసీసీ తేల్చి చెప్పింది. ఐసీసీ, పీసీబీ తో పాటు ఆ రోజు పోటీపడే జట్లకు సంబంధించిన దేశాల జెండాలను ఎగురవేయాలని స్పష్టం చేసింది. దీంతో పాకిస్తాన్ స్టేడియంలో భారత జెండాను ఉంచింది. ఆతిథ్య దేశంలో భారత జెండాకు స్థానం దక్కిందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా హర్షం వ్యక్తం చేశారు.
చాంపియన్స్ ట్రోఫీలో 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి టైటిల్ కోసం పోరాడనున్నాయి. తొలి రౌండ్లో 12 మ్యాచ్లు, ఆ తర్వాత నాకౌట్ దశ ఉంటుంది. తొలి మ్యాచ్ లో భాగంగా ఈ రోజు (ఫిబ్రవరి) మధ్యాహ్నం 2.30 గంటలకు కరాచీ వేదికగా పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి.
గ్రూప్-ఎలో భారత్, బంగ్లాదేశ్, న్యూజీలాండ్, పాకిస్తాన్ ఉండగా, గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి.