మహాకుంభమేళా సందర్భాన్ని పురస్కరించుకుని ప్రయాగరాజ్‌లోని త్రివేణీ సంగమంలో మంగళవారం నాడు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పవిత్ర స్నానం ఆచరించారు. ఆయన వెంట సతీమణి ఉష, కుమారుడు హర్షవర్ధన్, మనవరాలు నిహారిక కూడా పవిత్ర స్నానం చేసారు. ‘‘కుంభమేళా సనాతన ధర్మానికి, సంస్కృతికి అద్భుతమైన ప్రతీక. ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా దివ్య సందర్భంలో పవిత్రస్నానం ఆచరించే సౌభాగ్యం ప్రాప్తించింది. దేశ ప్రజలందరికీ సుఖం, ఆరోగ్యం, సమృద్ధి ఇవ్వాలని గంగామాతను కోరుకున్నాను. హర హర గంగే, హర హర మహాదేవ్’’ అని వెంకయ్య నాయుడు ఎక్స్‌లో ట్వీట్ చేసారు.
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు జి కిషన్‌రెడ్డి కూడా మంగళవారం నాడు ప్రయాగరాజ్‌లో పుణ్యస్నానం చేసారు. కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణీసంగమంలో స్నానం చేసారు. ఆ అనుభూతి గురించి కిషన్‌రెడ్డి తన ఎక్స్ ఖాతాలో ఇలా వివరించారు. ‘‘ప్రయాగరాజ్ కుంభ మేళా సందర్భంగా.. కుటుంబ సమేతంగా ఇవాళ త్రివేణి సంగమంలో పుణ్య స్నానమాచరించాను. పరమ పవిత్రమైన కుంభమేళా లో స్నానం సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. ప్రయాగరాజ్ లో కోట్లాది మంది భక్తుల పుణ్యస్నానాలు.. సనాతన ధర్మం , మన సంస్కృతి, సంప్రదాయాలపై రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణకు ఒక సజీవమైన ఉదాహరణ. ఈ సందర్భంగా.. దేశ ప్రజలందరికీ సుఖశాంతులు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించాను.’’
మహాకుంభమేళాలో మంగళవారం నాటికి మొత్తం 55కోట్ల 56లక్షల మంది పవిత్ర స్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ అధికారులు వెల్లడించారు.