తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై నమోదైన కేసులో సిట్ విచారణ ముగిసింది. తిరుపతిలో సిట్ కార్యాయంలో ఐదు రోజుల పాటు సాగిన విచారణ మంగళవారంతో ముగిసింది.
సిట్ అధికారులు పలు అంశాలపై కీలక సమాచారం రాబట్టారు. భోలే బాబా డెయిరీ మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, శ్రీ వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ లను సిట్ ప్రశ్నించింది.నలుగురు నిందితులకు తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కస్టడీ ముగిసిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు.
టీటీడీ పరిధిలో ప్రసాదంగా అందించే లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు గత ఏడాది అక్టోబర్ 4న ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ స్వతంత్ర దర్యాప్తు బృందం సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేసే ఇద్దరు అధికారులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేట్ చేసే ఇద్దరు అధికారులతోపాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)కి చెందిన సీనియర్ అధికారి సభ్యులుగా ఉన్నారు.