ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు రంజాన్ నెలలో గంట ముందు వెళ్ళిపోయేందుకు వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఆ ఆదేశాలు మార్చి 2 నుంచి 30 వరకూ అమల్లో ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి మేరకు, ప్రభుత్వంలోని సాధారణ పరిపాలనా విభాగం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రంజాన్ నెంలలో ముస్లిములకు అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉండేలా మరికొన్ని నిర్ణయాలతో ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
రంజాన్ నెల సందర్భంగా ప్రజారోగ్యాన్ని జాగ్రత్తగా పరిరక్షించేందుకు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తగిన శానిటేషన్ సౌకర్యం కల్పించాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. మసీదులు, ఈద్‌గాలు, ముస్లిం ప్రాంతాల్లో తాగునీటికి, విద్యుత్తుకు అవాంతరాలు రాకుండా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు.
రంజాన్ సందర్భంగా దుకాణాలు, కూరగాయల సంతలు, హోటళ్ళు తెరిచి ఉంచే సమయాలను పొడిగించారు. రాత్రి వేళల్లోనూ, తెల్లవారుజాము సమయాల్లోనూ దుకాణాలన్నీ అందుబాటులో ఉంచుతున్నారు. ఆ మేరకు చర్యలు తీసుకోవాలంటూ పోలీసు అధికారులకు సూచించారు.
మసీదుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురవకుండా చర్యలు తీసుకోవాలంటూ జిల్లా యంత్రాంగాలను ఆదేశించారు. మసీదుల్లో ఏర్పాట్ల విషయంలో ఎలాంటి ఫిర్యాదులూ రావడానికి వీల్లేదని హెచ్చరించారు.
తెలంగాణలో కూడా రంజాన్ నెలలో ముస్లిం ప్రభుత్వోద్యోగులకు గంట ముందు ఇంటికి వెళ్ళిపోయే వెసులుబాటు కల్పిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమామ్‌లు ముయిజ్జెన్‌లకు ఆరు నెలలుగా బకాయి ఉన్న గౌరవ వేతనాల కోసం రూ.45కోట్లు విడుదల చేసింది. గత ప్రభుత్వ పాలనలో బకాయిలు పడిన వారికి ఆ నిధులను వచ్చే ఏప్రిల్ నుంచీ అందజేస్తారు.
టీడీపీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షరీఫ్ ఆ విషయం గురించి ప్రకటిస్తూ 2024-25 రాష్ట్ర బడ్జెట్‌లో ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం రూ.4376 కోట్లు కేటాయించారని వెల్లడించారు. గత వైసీపీ హయాంలో ఇటువంటి సంక్షేమ పథకాలకు నిధులు సకాలంలో చెల్లించలేదని, కొన్ని పథకాలను నిలిపివేసారనీ షరీఫ్ దుయ్యబట్టారు. ప్రస్తత కూటమి ప్రభుత్వం వచ్చాకే వారికి ఊరట లభిస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇమామ్‌లు ముయిజ్జెన్‌లకు గౌరవ వేతనం ఇచ్చే పథకాన్ని 2014-19 వ్యవధిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇమామ్‌కు రూ.5వేలు, ముయిజ్జెన్‌లకు రూ.3వేలు ఇచ్చేది. తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్‌సిపి ప్రభుత్వం ఆ మొత్తాలను పెంచింది. ఇమామ్‌లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.10వేలకు, ముయిజ్జెన్‌లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.5వేలకు పెంచింది.