మధ్యప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నియాజ్ ఖాన్ తాజా ప్రకటన ముస్లిం సమాజంలో సంచలనం కలిగించింది. ఇస్లాం అరబ్బు మతం మాత్రమే, భారతదేశంలోని ప్రజలందరూ ఒకప్పుడు హిందువులు మాత్రమే అని నియాజ్ ఖాన్ పేర్కొన్నారు. సామాజిక అంశాలపై సాధికారంగా స్పందించే నియాజ్ ఖాన్, ఎక్స్ సామాజిక మాధ్యమంలో ఇటీవల పెట్టిన పోస్ట్‌లో ఆ వ్యాఖ్యలు చేసారు.
నియాజ్ ఖాన్ తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు: ‘‘ఇస్లాం ఒక అరబ్బు మతం. ఇక్కడ (భారతదేశంలో) అందరూ ఒకప్పుడు హిందువులే. ఈ ప్రజలను హిందూమతం నుంచి ఇస్లాంలోకి మతం మార్చారు. అందుకే, మతాలు వేరైనప్పటికీ మనందరి రక్తం ఒకటే. మనందరం ఒకే సంస్కృతిలో భాగాలం. అరబ్బులను ఆదర్శంగా తీసుకునే భారతీయ ముస్లిములు తమ పద్ధతిని మళ్ళీ ఆలోచించుకోవాలి. మొదట హిందువులను మీ సోదరులుగా గుర్తించండి. ఆ తర్వాతే అరేబియా వైపు చూడండి.’’
నియాజ్ ఖాన్ ట్వీట్‌తో సామాజిక మాధ్యమం ఎక్స్ హోరెత్తిపోయింది. అన్ని మతాలనూ, రాజకీయ భావాలనూ అనుసరించే వ్యక్తులూ, సంస్థలూ అలా ప్రతీఒక్కరూ స్పందించారు.
ఆ విషయమై మీడియాతో మాట్లాడుతూ నియాజ్ ఖాన్ తన వైఖరిని స్పష్టం చేసారు. ‘‘ఇస్లాం అరబ్బు మతం. అది సౌదీ అరేబియా నుంచి భారత్‌లోకి వచ్చింది. కానీ ఇక్కడి ముస్లిముల సాంస్కృతిక, ఆధ్యాత్మిక మూలాలు ఇక్కడి సనాతన ధర్మంలో బలంగా ఉన్నాయి. ఇండోనేసియా, మలేసియా వంటి దేశాల్లో ప్రజలు తమ పాత మతాలను వదిలిపెట్టి బాహ్య ప్రభావాల కారణంగా కొత్త మతాలను హత్తుకున్నారు. కానీ వారు తమ జన్యు, సాంస్కృతిక సంబంధాలను ద్వారా తమ పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ దేశంలో ఇతర మతాలు వ్యాప్తి చెంది ఉండవచ్చు, కానీ భారతదేశపు సాంస్కృతిక పునాది హిందుత్వం అనడంలో సందేహమే లేదు’’ అని నియాజ్ ఖాన్ వివరించారు.
భారతదేశంలో హిందువులు, ముస్లిములది ఒకే వారసత్వం అని జన్యుశాస్త్ర అధ్యయనాలు స్పష్టం చేసాయని ఖాన్ వివరించారు. రెండు మతాల ప్రజలూ జన్యుపరంగా కలిసే ఉన్నారు, కానీ భారత్‌లోని కొందరు ముస్లిములు మాత్రం తమ భారతీయ అస్తిత్వాన్ని పట్టించుకోకుండా అరబ్బు సంస్కృతికి ప్రాధాన్యం ఇస్తారు, అది భారతీయ అస్తిత్వం నుంచి వారిని వేరు చేస్తుంది అని నియాజ్ ఖాన్ అభిప్రాయపడ్డారు. తమ భారతీయ మూలాల కంటె అరబ్బు సంస్కృతిని గొప్పగా భావించడం సరికాదని, వారు తమ వైఖరిని పునరాలోచించుకోవాలనీ సూచించారు. అలాంటి ముస్లిములు అరేబియా వైపు చూడడం కంటె ముందు తమ హిందూ సోదరులను గుర్తించాలన్నారు.
నియాజ్ ఖాన్ భారతీయ ముస్లిములకు చేసిన ప్రధానమైన సూచన ఏంటంటే… వారు అరబ్బులను దైవాలుగా భావించడాన్ని పునరాలోచించుకోవాలి. విదేశీయుల కంటె ఆదర్శప్రాయులైన స్వదేశీయుల మీద, విద్వాంసుల మీద దృష్టి సారించాలి. అయితే పలువురు ముస్లిములు ఆ సూచనను… ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం అస్తిత్వాన్ని తీర్చిదిద్దిన అరబ్బు సంస్కృతి, చరిత్ర ప్రాధాన్యతను తగ్గించడమే అవుతుందని… వ్యాఖ్యానిస్తున్నారు. భారతీయ ముస్లిములు అరబ్బు ప్రపంచంతో తమ మత, సాంస్కృతిక సంబంధాల కంటె తమ భారతీయ అస్తిత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ నియాజ్ ఖాన్ చేసిన సూచన వల్ల సమాజంలో మరింత విభజనలు వస్తాయని, మత ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతాయనీ కొందరు విమర్శిస్తున్నారు.
నియాజ్ ఖాన్ మాత్రం తన ప్రకటనను పూర్తిగా సమర్ధించుకున్నారు. తన ప్రకటన రాజకీయ ప్రేరేపితం కాదని, భారతదేశంలో హిందూ ముస్లిములకు ఒకే సాంస్కృతిక మూలాలు ఉన్నాయని గుర్తు చేసే ప్రయత్నం మాత్రమేననీ చెప్పుకొచ్చారు. భారత్ ప్రధానంగా హిందూదేశం, విదేశీ పాలకులు ఇతర మతాలను తీసుకొచ్చారు, దేశ జనాభాలో మెజారిటీ ప్రజలు ఈ భూమిమీద పుట్టినవారే. కేవలం 1-2శాతం జనాలు అరేబియా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఉండవచ్చు. మిగతా అందరూ భారతదేశపు మూలాలు ఉన్నవారే. అలా, ఉమ్మడి వారసత్వం ఉన్నందున, దేశంలో అన్ని మతాల వారూ శాంతియుతంగా కలిసికట్టుగా జీవించాలి, ఎలాంటి విభజనలూ విద్వేష భావనలూ లేకుండా బతకాలి అని చెప్పుకొచ్చారు.
తన ప్రకటనకు మూలం ఈ దేశంలో ప్రతీదీ సనాతన ధర్మంలో భాగమేనన్న విశ్వాసమేనని నియాజ్ ఖాన్ చెప్పుకొచ్చారు. ‘‘కాలక్రమంలోని మతమార్పిడులే ఇవాళ భారతదేశంలో మతపరమైన వైవిధ్యానికి కారణం. నా జన్యువులను ప్రయోగశాలలో పరీక్షిస్తే అవి అరబ్బు దేశాల జన్యువులను పోలి ఉండవు, భారతదేశపు జన్యువులనే పోలి ఉంటాయి. అందుకే భారతీయులందరూ, వారి మతంతో సంబంధం లేకుండా, ఒకరితో ఒకరికి జన్యుసంబంధం ఉంటుంది. విదేశీ ఆక్రమణదారులు భారత్‌కు వచ్చారు, ఆ తర్వాతే మతమార్పిడులు జరిగాయి అనే అన్నిచోట్లా నేర్పిస్తారు. అందరికీ హిందూ ధర్మమే మూలం. ఆ విషయాన్నే ట్వీట్ చేసాను’’ అని నియాజ్ ఖాన్ తన ప్రకటనను సమర్ధించుకున్నారు.