టీడీపీ నాయకులే వల్లభనేని వంశీని రెచ్చగొట్టి అక్రమ కేసులు పెట్టారని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కాసేపటి కిందట పరామర్శించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో వంశీ లేకపోయినా ఆయన పేరును తాజాగా చేర్చారని జగన్‌మోహన్‌రెడ్డి గుర్తుచేశారు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో గన్నవరంలో నమోదైన కేసుల్లో ఎక్కడా వంశీ పేరులేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక సత్యవర్ధన్‌ను బెదిరించి అతనితో కేసులు పెట్టించారని, అయినా ఆ కేసులో కూడా వంశీ పేరు చేర్చలేదని చెప్పారు. పోలీసులకు సత్యవర్ధన్ ఇచ్చిన వాంగ్మూలంలో ఎక్కడా కూడా తనను ఎవరూ ధూషించలేదని చెప్పినట్లు గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.
టీడీపీ అధికారంలోకి రాగానే సత్యవర్థన్‌ను బెదిరించి వంశీపై ఫిర్యాదు చేయించారని జగన్‌మోహన్‌రెడ్డి గుర్తుచేశారు. వంశీని ఎలాగైనా జైలుకు పంపాలనే కుట్రతో 71వ నిందితుడిగా చేర్చినట్లు చెప్పారు. ఇవన్నీ బెయిలబుల్ నేరాలు కాబట్టి మరో కుట్ర పన్నారని తెలిపారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయాన్ని కాల్చిన కేసును వంశీ మీదకు నెట్టారని చెప్పారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్‌తో అట్రాసిటీ కేసు నమోదు చేయించారని జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయం నిర్వహిస్తోన్న భవనం ఎస్సీ ఎస్టీలది కాదని తెలిపారు. వంశీకి బెయిల్ రాకూడదని చంద్రబాబునాయుడు కుట్రలు చేశాడని జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.