ఉగ్రవాదంటూ మండిపాటు… కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తప్పదని హెచ్చరిక
మాతృభూమిలో అడుగుపెట్టి తమ పార్టీ కార్యకర్తల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అన్నారు. దేవుడు తనను ప్రాణాలతో ఉంచింది అందుకేనని, బంగ్లాదేశ్ ను ప్రస్తుతం ఉగ్రవాద ప్రభుత్వం పాలిస్తోందన్నారు. మహ్మద్ యూనస్ ఓ ఉగ్రవాది అని మండిపడిన హసీనా, త్వరలోనే దేశంలో అడుగుపెడతానన్నారు.
బంగ్లాదేశ్ లో అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హసీనా జూమ్ కాల్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. తాను దేశంలో అడుగుపెట్టేవరకు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఓపిక పట్టాలని కోరారు.
జులై- ఆగస్టుల్లో విద్యార్థులు చేపట్టిన ర్యాలీ సందర్భంగా పోలీసులు, అవామీ లీగ్ కార్యకర్తలు, విద్యావంతులు, కళాకారులు హత్యకు గురయ్యారని హసీనా తెలిపారు. హత్యలకు కారణమైన వారిపై యూనస్ చర్యలు తీసుకోలేదన్నారు. విచారణ కమిటీలు రద్దు చేసి యూనస్ ప్రభుత్వం దేశాన్ని నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ కార్యాలయాలపైనా, అధికారులపైనా దాడులు చేయడం యూనస్ అసమర్థతకు నిదర్శనమని, మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా అల్లర్లు ఆగకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.