దిల్లీలో 26 ఏళ్ళ తర్వాత అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, సినీతారలు పాల్గొననున్నారు. ఫిబ్రవరి 20న గురువారం సాయంత్రం 4.30 గంటలకు కొత్త సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ విషయాన్ని బీజేపీ అధికారికంగా ఖరారు చేసింది.
ప్రఖ్యాత రామ్‌లీలా మైదానంలో జరిగే ప్రమాణస్వీకార వేడుకలో ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుంది. సినీతారలు, పారిశ్రామికవేత్తలతో పాటు ఇతర దేశాల దౌత్యవేత్తలు, 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
దిల్లీకి చెందిన రైతులు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులును బీజేపీ ఆహ్వానించనుంది. బాబా రాందేవ్, స్వామి చిదానంద, బాబా బాగేశ్వర్ ధీరేంద్రశాస్త్రి వంటి ఆధ్యాత్మిక గురువులు ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు.
బీజేపీ శాసనసభాపక్ష భేటీ ఫిబ్రవరి 19న జరగనుంది. ఆ సమావేశంలో కొత్త సీఎంతో పాటు కేబినెట్ మంత్రులను ఎన్నుకోనున్నారు.