దక్షిణాది రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తోన్న జీబీఎస్ వైరస్ ఏపీ ప్రజలకు కలవరపెడుతోంది. ఇప్పటికే 40కిపైగా కేసులు నమోదయ్యాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జీబీఎస్ సిండ్రోమ్‌కు చికిత్స పొందుతోన్న ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జీబీఎస్ కట్టడికి అవసరమైన మందులు కొనుగోలు చేసేందుకు సీఎం చంద్రబాబునాయుడుతో చర్చించి వెంటనే రూ.130 కోట్లు విడుదల చేయించారు.
పలు జిల్లాల్లో జీబీఎస్ కేసులు పెరుగుతున్నాయి. కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్లే జీబీఎస్ వైరస్ సోకుతోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. జీబీఎస్ కట్టడికి మందులు అందుబాటులో ఉన్నాయని ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని డాక్టర్లు చెబుతున్నారు.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జీబీఎస్ రోగుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ప్రతి ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో జీబీఎస్ రోగులకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.