తాను స్వలింగ సంపర్కుడైన ఇమామ్‌నని ప్రకటించుకున్న ప్రపంచంలోనే మొట్టమొదటి ముస్లిం ఇమామ్ ముహిసిన్ హెండ్రిక్స్ హత్యకు గురయ్యాడు. దక్షిణాఫ్రికాలోని ‘కెబెరా’లో నిన్న సోమవారం పట్టపగలే ఆయనను కొందరు దుండగులు కాల్చి చంపేసారు. 53ఏళ్ళ హెండ్రిక్స్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఎల్‌జీబీటీ-ఫ్రెండ్లీ మసీదులో ఇమామ్. ఆయన తన జీవితాన్ని ఎల్‌జీబీటీ ముస్లిముల రక్షణ కోసం అంకితం చేసాడు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం హెండ్రిక్స్ ఒక కారులో మరో వ్యక్తితో కలిసి కూర్చుని ఉన్నాడు. అంతలో ఇద్దరు వ్యక్తులు ముసుగులు తొడుక్కుని మోటార్ సైకిల్ మీద వచ్చి కాల్పులు జరిపారు. ఆ వెంటనే వారు ఆ ప్రదేశం నుంచి పారిపోయారు. ఆ దాడిలో హెండ్రిక్స్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయింది. హెండ్రిక్స్ తీవ్ర గాయాల వల్ల ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు.
హెండ్రిక్స్ గత పాతికేళ్ళుగా ఎల్‌జీబీటీ ముస్లిముల హక్కుల కోసం పోరాడుతున్నాడు. ఇస్లాంలోని ఛాందసవాద భావాలకు వ్యతిరేకంగా పోరాటం చేసాడు. ముస్లిములలో తమ లైంగిక అస్తిత్వాలతో ఘర్షణ పడుతున్న వారికి మద్దతుగా నిలిచేందుకు ఇన్నర్ సర్కిల్ అనే సంస్థను స్థాపించాడు. స్వలింగ వివాహాలు చేసుకున్న ముస్లిములను ఆదరంతో చూసాడు. ఆ చర్యలపై ఛాందసవాద ఇస్లామిక్ నాయకుల ఆగ్రహం అవధులు దాటింది.
హెండ్రిక్స్ జీవిత కాల కార్యాచరణకు ప్రశంసలూ విమర్శలూ రెండూ దక్కాయి. ఇస్లాంను ఎక్కువమందికి చేరువ చేసే ప్రయత్నాలకు అతన్ని ప్రశంసించినవారు కొందరు. కానీ పలువురు కరడుగట్టిన మతఛాందస విద్వాంసులు ఆయన చర్యలను దైవద్రోహంగా పరిగణించారు. ఎల్‌జిబిటిలలో ఏదో ఒకరిగా ఉండడం మతచట్టం ప్రకారం నేరం అని చాలామంది ఇస్లాం మతగురువులు బహిరంగంగానే ప్రకటించారు, అలాంటివారు హెండ్రిక్స్ చర్యలను తీవ్రంగా విమర్శించారు.
హెండ్రిక్స్ హత్య చిరకాలంగా ఆందోళనకరంగా ఉన్న అంశాన్నే మరోసారి ముందుకు తీసుకొచ్చింది. మతపరమైన సమాజాల్లో ప్రగతిశీల స్వరాలకు వ్యతిరేకంగా పెరుగుతున్న అసహనం, హింసల గురించి ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎల్‌జిబిటి హక్కుల విషయంలో చట్టబద్ధంగా ప్రగతిశీలంగా నిలిచిన దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటి. ఒక వ్యక్తి లైంగిక ధోరణిని బట్టి వివక్ష చూపించడాన్ని నిషేధిస్తూ చట్టం చేసిన ప్రపంచంలోని మొదటి దేశం దక్షిణాఫ్రికాయే. అయినా అక్కడి సమాజంలో ఇంకా మతపరంగా ఆ వివక్ష పోలేదన్నది నిజం.
ఇస్లామిక్ ఛాందసవాదులు ఎల్‌జిబిటిలను వ్యతిరేకించడం అన్నది చరిత్రలో నమోదైన వాస్తవం. స్వలింగ సంపర్కాన్ని దారుణమైన పాపంగా చాలామంది ముస్లిం మతగురువులు ప్రకటించారు. ఆఫ్రికాలో చాలా ప్రాంతాల్లో స్వలింగ సంపర్కాన్ని అసహ్యించుకోవడం మాత్రమే కాదు, దాన్ని నేరంగా కూడా భావిస్తారు. కొన్ని దేశాల్లో అయితే స్వలింగ సంపర్క నేరాలకు కొన్ని చోట్ల మరణశిక్షకూడా విధిస్తున్నారు.
హెండ్రిక్స్ హత్య, ఇస్లామిక్ సమాజాన్ని మరింత సమ్మిళితం చేయాలన్న అతని లక్ష్యంపై జరిగిన దాడిగా అతని అనుయాయులు భావిస్తున్నారు. ‘‘హెండ్రిక్స్‌కు తన చర్యల వల్ల ముప్పు పొంచివుందని తెలుసు, కానీ ఆయన తన నిబద్ధత నుంచి అంగుళం కూడా కదల్లేదు. ఒకరిని దూరంగా నెట్టేయడానికి విశ్వాసం కారణం కారాదని ఆయన నమ్మకం’’ అని ఇన్నర్ సర్కిల్ సభ్యుడు ఒకరు చెప్పుకొచ్చారు.
హెండ్రిక్స్ హత్య విద్వేష నేరం అని, ఆ కేసును న్యాయస్థానాలు ఆ విధంగానే పరిగణించి విచారణ జరపాలని పలువురు ఎల్‌జిబిటి కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.