భారత ఎన్నికల కమిషన్ సారథిగా జ్ఞానేశ్ కుమార్, కమిషనర్‌గా వివేక్ జోషి నియమితులయ్యారు. వీరి నియామకానికి సంబంధించి సోమవారం రాత్రి రెండు నోటిఫికేషన్లు విడుదల చేశారు. ప్రధాని నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ పదవులకు వీరి పేర్లను సిఫార్సు చేసింది.
ప్రస్తుత ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ పదవీ కాలం నేటితో ముగియనుంది. దీంతో కొత్త చీఫ్ కమిషనర్, కమిషనర్‌ను నియమించారు. 2023లో ఏర్పాటు చేసిన నిబంధనల ప్రకారం వీరి నియామకం జరిగింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీలో హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నారు. సోమవారం
జ్ఞానేశ్ కుమార్, వివేక్ జోషి పేర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు పంపగా వెంటనే ఆమోదం అభించింది. దీంతో నోటిఫికేషన్ విడుదల చేశారు.
1988 బ్యాచ్ ఐఏఎస్ కేరళ క్యాడర్‌కు చెందిన జ్ఞానేశ్ కుమార్ పలు శాఖల్లో బాధ్యతలు నిర్వహించారు. 370 ఆర్టికల్ రద్దుకు సంబంధించిన బిల్లు రూపకల్పనలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన హోం శాఖ కార్యదర్శిగా ఉన్నారు. సహకార శాఖ కార్యదర్శిగానూ సేవలు అందించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అత్యంత ఆప్తుడిగా పేరు సంపాదించారు. జ్ఞానేశ్ కుమార్ 2029 జనవరి 26 వరకు పదవిలో కొనసాగుతారు. ఈ ఏడాది చివరిలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది తమిళనాడు, పాండిచ్చేరి ఎన్నికలు జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలో జరగనున్నాయి.
జ్ఞానేశ్ కుమార్ నియామకంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నెల19 విచారణకు రానుంది. అప్పటి వరకు నియామకం నిలిపివేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.