సీబీఎస్‌ఈ బోర్డు ఫిబ్రవరి 15 నుంచి నిర్వహిస్తోన్న 10, 11, 12 తరగతి పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయంటూ కొందరు సోషల్ మీడియాలో చేస్తోన్న ప్రచారంపై బోర్డు సీరియస్ అయింది. అలాంటి వదంతులు నమ్మ వద్దని కోరింది. సోషల్ మీడియాలో పేపరు లీకు అంటూ పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. పరీక్షలకు ముందే సీబీఎస్‌ఈ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక సమాచారం కోసం సీబీఎస్‌ఈ వెబ్ సైట్ మాత్రమే చూడాలని సూచించింది.
దేశ వ్యాప్తంగా 8 వేల పాఠశాలల్లో 44 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కొందరు కావాలనే విద్యార్థులను, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచేందుకు యూట్యూబ్, పేస్ బుక్, ఇన్ స్టాల్లో పేపరు లీకు అంటూ వదంతులు వ్యాపింపజేసిన విషయాన్ని సీబీఎస్‌ఈ దృష్టికి చేరింది. దీనిపై కేంద్ర సంస్థలు విచారణ చేస్తున్నాయని సంస్థ తెలిపింది. విద్యార్థులు ఇలాంటి పోస్టులు పెట్టినట్లు రుజువైతే వారు మూడేళ్లపాటు ఎలాంటి పరీక్షలు రాయడానికి అర్హులు కాదని హెచ్చరించింది.
వదంతులు వ్యాపింపజేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేంది లేదని సీబీఎస్‌ఈ బోర్డు హెచ్చరించింది. విద్యార్థులు ఎలాంటి సంకోచాలు, భయాలు లేకుండా పరీక్షలకు హాజరుకావాలని కోరింది.