దేశ రాజధాని ఢిల్లీ పర్యావరణ ఆరోగ్యాన్ని, సాంస్కృతిక వారసత్వాన్నీ పునరుద్ధరించడానికి మోదీ ప్రభుత్వం యమునానది ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించింది. చిరకాలంగా ఎదురుచూస్తున్న ప్రక్షాళనతో పాటు 27ఏళ్ళుగా ఆగిపోయిన యమునా నదికి హారతి సంప్రదాయాన్ని కూడా పునరుద్ధరించారు. ఢిల్లీలో బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముందే ఈ కార్యక్రమం మొదలుపెట్టడం విశేషం, అరవింద్ కేజ్రీవాల్ వాగ్దాన భంగాలు, కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాల వైఫల్యాలకు భిన్నంగా యమునానది ప్రక్షాళన కార్యక్రమాన్ని బీజేపీ ఇంకా గద్దెనెక్కక ముందే ప్రారంభించింది. ఢిల్లీని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడానికి, దేశ రాజధానికి ఆధ్యాత్మిక శోభలు అద్దడానికీ కాషాయ సర్కారు కంకణం కట్టుకుంది.
దశాబ్ద కాలం పాటు రాజకీయ శుష్క వాగ్దానాలు చేయడమే తప్ప ఒక్క అంగుళం పని కూడా చేయని ఆప్ సర్కారు కూలిపోయింది. కేంద్రంలో నరేంద్రమోదీ సర్కారుతో పాటు రాజధాని రాష్ట్రంలో సైతం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. డబుల్ ఇంజన్ సర్కారుతో ఇక ఢిల్లీకి మంచిరోజులు వచ్చాయని కాషాయదళం చెబుతోంది. ఢిల్లీ ప్రజలకు చిరకాలం నుంచీ అమలవకుండా ఉండిపోయిన వాగ్దానాన్ని పూర్తి చేయడానికి బీజేపీ కంకణం కట్టుకుంది. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా పర్యవేక్షణలో యమునా నది ప్రక్షాళనకు ఆదివారం అధికారికంగా శ్రీకారం చుట్టింది. నాలుగు అంచెల వ్యూహంతో రాబోయే మూడేళ్ళలో యమునా నది ఆరోగ్యాన్ని పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ట్రాష్ స్కిమ్మర్స్, వీడ్ హార్వెస్టర్స్, డ్రెడ్జ్ యుటిలిటీ క్రాఫ్ట్స్ సాయంతో నది నుంచి వ్యర్థాలను తొలగిస్తారు. ఢిల్లీని పట్టిపీడిస్తున్న అత్యంత సంక్లిష్టమైన పర్యావరణ సమస్యల్లో ఒకటైన యమున కాలుష్యాన్ని పరిష్కరించే దిశగా ప్రయత్నం మొదలైంది.
యమున ప్రక్షాళన ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచార వాగ్దానం కూడా. యమునా నదిని సమూలంగా ప్రక్షాళన చేస్తామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రచార సభల్లో పదేపదే చెప్పారు. యమునను పూర్తిగా శుభ్రం చేస్తామని, నదిని పునరుజ్జీవింపజేస్తామనీ హామీ ఇచ్చారు. గత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా గతంలో అలాంటి వాగ్దానాలే చేసినా వాటిని ఏనాడూ పట్టించుకోలేదు. కానీ బీజేపీ మాత్రం ఇంకా అధికార పగ్గాలు చేతిలోకి తీసుకోకముందే పని మొదలుపెట్టేసింది. కేజ్రీవాల్ హయాంలో యమున కాలుష్యం ఇంకా పెరుగుతూనే వచ్చింది. అంతేకాదు, శతాబ్దాలుగా జరుగుతున్న యమునా నదీహారతి సంప్రదాయాన్ని సుమారు మూడు దశాబ్దాల క్రితం ఆపివేసారు. ఇప్పుడు ప్రక్షాళన పనులతో పాటు హారతి సంప్రదాయాన్ని పునరుద్ధరించారు కూడా. నిన్న ఆదివారం సాయంసంధ్య వేళ వాసుదేవ్ ఘాట్ వద్ద భవ్య యమునా హారతి నిర్వహించారు.
యమున ప్రక్షాళన సమగ్ర ప్రణాళికలో భాగంగా నదిలోకి శుద్ధి చేయని పారిశ్రామిక వ్యర్థ జలాలను వదిలిపెట్టకుండా పరిశ్రమలను నియంత్రిస్తారు. పర్యావరణ ప్రమాణాల అమలు కచ్చితంగా జరుగుతోందా లేదా అన్న సంగతిని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ తనిఖీ చేస్తూంటుంది. ఫలితంగా యమున ప్రక్షాళన కేవలం స్వల్పకాలానికే కాక, దీర్ఘకాలికంగా చేస్తున్నారు.