ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే సుక్మా-బిజాపూర్ జిల్లాల సరిహద్దులోని టేకలగూడెంలో సిఆర్‌పిఎఫ్ బలగాలు ఒక పాఠశాల ప్రారంభించాయి.
సుక్మా, బిజాపూర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మావోయిస్టుల సురక్షిత స్థావరాలుగా ఉండేవి. అక్కడ ఇప్పటికి ఎంతోమంది సైనికులను, భద్రతా బలగాలను హతమార్చారు. అలాంటి చోట పరిస్థితుల్లో మార్పు వస్తోంది. దానికి నిదర్శనమే ఈ పాఠశాల.
దేశానికి స్వతంత్రం వచ్చిన నాటినుంచీ నేటివరకూ ఎన్నో దశాబ్దాల పాటు ఆ ప్రాంతాల్లో బడులు లేవు. సాధారణ జీవితం జీవించడానికి కూడా గిరిజనులకు ఆస్కారం లేకుండా చేసారు మావోయిస్టులు. ఆ ప్రాంతాల్లో బడులు కట్టకుండా అడ్డుకున్నారు. పాఠశాలలు నిర్మించడానికి ప్రయత్నించిన వారిని చంపేసిన సందర్భాలు కోకొల్లలు. అయితే ఇప్పుడు సిఆర్‌పిఎఫ్ 150వ బెటాలియన్ అక్కడ బడి కట్టింది. దాంతో పిల్లలకు కూచుని చదువుకోడానికి ఒక జాగా దొరికింది.
టేకలగూడెం గ్రామానికి చెందిన ఒక గ్రామస్తుడు ఇలా చెప్పాడు. ‘‘మా గ్రామంలో ఇప్పటివరకూ బడే లేదు. నక్సలైట్లు ఎవరినీ ఇక్కడ బడి కట్టనివ్వలేదు. ఆ ప్రయత్నం చేసిన వారిని చంపేసారు కూడా. ఇప్పుడు మాకొక బడి వచ్చింది. దీన్ని కట్టిన సిఆర్‌పిఎఫ్‌కు కృతజ్ఞతలు. ఇక మా పిల్లలు రోజూ బడికి వెడతారు. వారికి అక్కడ ఆహారం కూడా పెడతారు’’ అని ఆనందం వ్యక్తం చేసాడు.
సుక్మా జిల్లాలో స్థితిగతులను మెరుగుపరచాలనే ఉద్దేశంతో జిల్లా పోలీసులు, స్థానిక అధికార యంత్రాంగం సహాయంతో సిఆర్‌పిఎఫ్ బెటాలియన్ ఈ బడిని నిర్మించింది.
‘‘సుక్మా జిల్లాలో నక్సలైట్లను తుడిచిపెట్టేసే ప్రయత్నంలో సిఆర్‌పిఎఫ్, జిల్లా పోలీసులు, అధికార యంత్రాంగం కలిసి టేకలగూడెం, పూవర్తి గ్రామాల్లో పాఠశాలలు నిర్వహిస్తున్నాయిఇక్కడ పిల్లలకు ఆహారం, పుస్తకాలు, క్రీడా సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ముందు గ్రామస్తులకు భద్రతా బలగాల మీద, ప్రభుత్వం మీద విశ్వాసం కల్పించడానికి 2024లో ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసాం. జవాన్లు అక్కడే ఉంటూ గ్రామస్తులతో మాట్లాడుతూ ఉండేవారు. అలా ప్రజలకు నమ్మకం కలిగింది. ఫలితంగా ఈ బడి నిర్మాణం జరిగింది’’ అని సుక్మా జిల్లా ఎస్‌పి కిరణ్ గంగారాం చవాన్ చెప్పారు.
బస్తర్‌లో నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా ఈ నక్సల్ ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులను సమూలంగా మార్చేయడానికి కష్టపడి పని చేస్తున్నాయి.