కర్ణాటకలోని మైసూరులో దారుణం చోటుచేసుకుంది. విశ్వేశ్వరయ్య నగర్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. మైసూరుకు చెందిన వ్యాపారి చేతన్, అతని భార్య రూపాలి, కుమారుడు కుశాల్, చేతన్ తల్లి ప్రియంవద ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య, తల్లి, కుమారుడికి విషం ఇచ్చి చంపిన తరవాత చేతన్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఆత్మహత్యకు ముందు చేతన్ అమెరికాలోని సోదరుడికి ఫోన్ చేసి అప్పుల వారి నుంచి ఒత్తిడి ఎక్కువైందని, కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పి ఫోన్ కట్ చేశాడు. చేతన్ సోదరుడు వెంటనే వారి బంధువులకు కాల్ చేశారు. బంధువులు చేతన్ నివాసం ఉంటోన్న అపార్టమెంటు ప్లాటుకు వచ్చి పరిశీలించగా అందరూ చనిపోయి కనిపించారు. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
చేతన్ కుటుంబం అదే అపార్టుమెంటులో పదేళ్ల నుంచి నివాసం ఉంటోంది. అయినా అతనికి అప్పుల బాధ ఉన్నట్లు కూడా ఎవరికీ తెలియదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.