ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందగా ఆ ఇంట్లోని వృద్ధురాలు ఆ విషయాన్ని రెండు రోజుల తర్వాత బయటపెట్టింది. ఈ ఘటన ఒడిశాలోని దెంకనల్ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది.
చౌలియా ఖమర్ గ్రామంలో నివసించే ఓ కుటుంబంలో ఒకే రోజు ముగ్గురు వ్యక్తులు వేరు వేరు గదుల్లో ఉరివేసుకుని మరణించారు. పుష్పాంజలి దాస్( 65) భర్త శంకర్షన్(70) ఒక గదిలో, ఆమె కుమార్తె సువర్ణ(45), మనవడు సంతోష్(18) ఉరివేసుకుని కనిపించారు.
సీలింగ్‌కు వేలాడుతున్న కుటుంబ సభ్యుల మృతదేహాలతో పుష్పాంజలి దాస్ రెండురోజులపాటు నివసించింది. చివరకు ఫిబ్రవరి 15న ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది. దెంకనల్ టౌన్‌కు వెళ్ళి విషయాన్ని కుమారుడు ప్రసన్నకుమార్ కు వివరించింది. కుటుంబ తగాదాల కారణంగా ప్రసన్నకుమార్ 30 ఏళ్ళగా ఇంటికి దూరంగా ఉంటున్నాడు.
ప్రసన్న కుమార్ గ్రామంలో తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి తన ఇంటికి వెళ్ళి చూడమని చెప్పగా నివాసం నుంచి దుర్వాసన వస్తోందని, ఇక్కడకు రావాలని అతడు సమాధానం ఇచ్చాడు. ప్రసన్న కుమార్ తన తల్లితో కలిసి గ్రామంలోని ఇంటికి చేరుకోగా తండ్రి, అక్క, మేనల్లుడి మృతదేహాలు రెండు గదుల్లో వేలాడటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.