ప్రపంచంలోని హిందువులంతా ఐక్యంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. పశ్చిమబెంగాల్లోని బర్దమాన్ సమీపంలోని సాయ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ప్రపంచంలో క్రమశిక్షణ కలిగిన మతం ఏదైనా ఉందంటే అది హిందూ మతమేనన్నారు. భిన్నత్వంలోనే ఏకత్వం ఉందని విశ్వసించే హిందూ సమాజం ఐక్యంగా ఉండాలన్నారు.
మార్పులను స్వాగతించాలని మోహన్ భాగవత్ సూచించారు. ఆర్ఎస్ఎస్ కేవలం హిందువుల గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతోందని కొందరు ప్రశ్నిస్తున్నారని, సమాజం పట్ల బాధ్యతగా ప్రవర్తించేది హిందూ మతమేనన్నారు.
200 సంవత్సరాలు దేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు, భారతీయలు పాలనకు పనికిరారని ప్రచారం చేసి చరిత్రను వక్రీకరించారని మోహన భాగవత్ గుర్తుచేశారు. ప్రజలు రాజులను, చక్రవర్తులను గుర్తుపెట్టుకోరని తండ్రికి ఇచ్చిన మాట కోసం 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన రాజును మాత్రం గుర్తుపెట్టుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ సమావేశానికి అనుమతులు నిరాకరించింది. దీంతో హైకోర్టుకు వెళ్లి అనుమతులు సాధించారు.