తెలంగాణలోని పెద్ద గట్టు లింగమంతుల స్వామి జాతర నేటి అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో దురాజ్‌పల్లి పరిధిలోని పెద్దగట్టు యాదవుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి. రెండేండ్లకోసారి ఐదు రోజులపాటు జరిగే ఈ జాతర నేటి (ఆదివారం) అర్ధరాత్రి గంపల ప్రదక్షిణలతో ప్రారంభం కానుంది. ఉత్సవాలకు సుమారు 20నుంచి 25లక్షల మంది భక్తులు వచ్చే అవకాశముందని అంచనా.
జాతరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతరలో అసాంఘిక వ్యక్తలకు చెక్ పెట్టేందుకు భారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ కు అనుసంధానించారు. జాతీయ రహదారి 65పై కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సూర్యాపేట ఎస్‌పీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళే వాహనాలను నార్కట్ పల్లి వద్ద మళ్లించి నల్గొండ వైపుగా మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ మీదుగా విజయవాడకు మళ్లించారు.
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలను కోదాడ వద్ద మళ్లించి హుజూర్ నగర్, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్‌పల్లి మీదుగా హైదరాబాద్ మళ్ళించారు.