ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించి యాసిడ్ దాడికి పాల్పడ్డ అరాచకవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో డిగ్రీ చదువుకుంటోన్న యవతిని ప్రేమిస్తున్నానంటూ గణేష్ అనే యువకుడు వెంటపడ్డారు. ఇటీవల ఆ యువతికి మేనమామ కుమారుడితో పెళ్లి నిశ్చయం కావడంతో గణేష్ పగ పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. తనకు దక్కని యువతి మరెవరికీ దక్కడానికి వీళ్లేదని యాసిడ్ దాడి చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు వెల్లడించారు. మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్ కూడా మదనపల్లెలో డిగ్రీ చదువుకుంటున్నాడని పోలీసులు తెలిపారు.
యాసిడ్ దాడిలో గాయపడ్డ యువతికి మెరుగైన చికిత్స అందించేందుకు బెంగళూరు తరలించారు. బాధితురాలి తల్లిదండ్రులకు మంత్రి నారా లోకేశ్ ఫోన్ చేసి పరామర్శించారు. బాధితురాలికి అయ్యే వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని భరోసా ఇచ్చారు.
మహిళలపై దాడి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. మహిళలపై చేయి వేయాలంటే భయపడే విధంగా చర్యలుంటాయని హెచ్చరించారు.