కేరళ రాష్ట్రంలోని ఓ కేథలిక్ చర్చి ఆవరణలో తవ్వకాలు జరపగా ఆశ్చర్యకర విషయం బయటపడింది. ఆ చర్చి ఉన్న పరిసరాల్లో పురాతన ఆలయం అవశేషాలు లభ్యం అయ్యాయి. చర్చికి సంబంధించిన 1.8 ఎకరాల భూమిని సాగు కోసం దున్నుతుండగా, శివలింగంతో సహా అనేక సనాతన ధర్మ చిహ్నాలు బయటపడ్డాయి. ఈ చర్చి శ్రీ వనదుర్గా భగవతి ఆలయానికి కిలోమీటరు దూరంలో ఉంది.
చర్చి స్థలంలో హిందూ ఆలయ అవశేషాలు బయటపడటంపై స్థానికంగా పెద్ద చర్చ జరుగుతోంది. శ్రీ వనదుర్గా భగవతి ఆలయ కమిటీ సభ్యుడు వినోద్ కేఎస్ ఈ విషయాన్ని నిర్ధారించారు. ఫిబ్రవరి 4నే అవశేషాలు బయటపడ్డాయని, రెండు రోజుల తర్వాత అక్కడ దీపాలు వెలిగించామని చెప్పారు.
హిందూ సమాజం మనోభావాలను గౌరవిస్తూ అక్కడ పూజలు నిర్వహించుకునేందుకు చర్చి నిర్వాహకులు సమ్మతి తెలిపారు. పలై డయోసెస్ ఛాన్సలర్ ఫాదర్ జోసెఫ్ కుట్టియాంకల్ అంగీకరించారు. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ, స్నేహపూర్వక వైఖరి గా అభివర్ణిస్తున్నారు.