న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం జరిగింది. మహాకుంభ మేళాకు వెళ్లే ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు భక్తులు పోటీ పడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులున్నారు. ప్రయాగ్రాజ్ వెళ్లే భువనేశ్వర్ ఎక్స్ప్రెస్, స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ ఆలస్యం కావడంతో ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రాగానే ఎక్కేందుకు ప్రయాణీకులు పోటీపడ్డారు. దీంతో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ ఘటనపై ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్తో మాట్లాడారు. ప్రయాణీకుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోవడం, అవసరానికి సరిపడా రైళ్లు లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఫిబ్రవరి 22తో మహాకుంభమేళా ముగియనుంది. ఇప్పటికే త్రివేణి సంగమంలో 50 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. మహాకుంభ మేళాను ఫిబ్రవరి చివరి వరకు కొనసాగించాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.