ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన నేటితో ముగిసింది. ఇవాళ ఆయన పళముదిర్‌చోళైలోని అరుళ్‌మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని, తిరుత్తణిలోని అరుళ్‌మిగు మురుగన్ ఆలయాన్నీ సందర్శించారు.
ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలుగా ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్ర సందర్శన యాత్రను పవన్ కళ్యాణ్ నేటితో ముగించారు. ఈ ఉదయం తమిళనాడు మదురై జిల్లా అళగర్ కొండల్లోని పళముదిర్‌చోళై అరుళ్‌మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. మురుగన్‌కు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో జరుగుతున్న స్కంద షష్టి కవచం, తిరుప్పుగళ్ పారాయణలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
పవన్‌కళ్యాణ్ అక్కడినుంచి బయల్దేరి మధ్యాహ్నానికి తిరుత్తణి చేరుకున్నారు. అక్కడ వల్లీదేవసేనా సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు. కుమారస్వామి ఆరు ముఖాలతో కనిపించే ఏకైక క్షేత్రంగా తిరుత్తణి ప్రత్యేకమైనది. అక్కడ గర్భాలయంలో అరుళ్‌మిగు మురుగన్‌కు పవన్ కళ్యాణ్ పూజలు చేసారు. ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజల అనంతరం, ఆలయ మంటపంలో అర్చకస్వాములు వేదాశీర్వచనాలు, స్వామివారి చందన ప్రసాదం అందజేశారు.
తిరుత్తణితో షష్ఠ షణ్ముఖ క్షేత్ర యాత్ర పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ సాయంత్రానికి విజయవాడకు చేరుకున్నారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరు క్షేత్రాల దర్శనం తనకెంతో ఆనందం కలిగించిందని, స్వామి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఈ పర్యటనలో పవన్‌తో పాటు ఆయన కుమారుడు అకిరా నందన్, టిటిడి బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి పాల్గొన్నారు.