ప్రార్థనా స్థలాల (ప్రత్యేక అంశాల) చట్టం 1991 మీద దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 17 సోమవారం నాడు విచారించనుంది. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆ అంశంపై విచారణ జరుపుతుంది.
1991లో పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రార్థనా స్థలాల చట్టం… 1947 ఆగస్టు 15 నాటికి అయోధ్య మినహా మిగతా ప్రార్థనా స్థలాల ధార్మిక స్వభావం ఎలా ఉన్నదాన్ని అలాగే ఉంచాలని చెబుతుంది. ఆ స్వభావాన్ని మార్చడాన్ని నిషేధించింది. ఆ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అదే సమయంలో దేశంలో మతసామరస్యాన్ని నిలబెట్టడానికి ఆ చట్టం అవసరమంటూ ఇతరులు వాదిస్తున్నారు.
వారణాసిలోని జ్ఞానవాపి, మథురలోని షాహీ ఈద్గా సహా దేశంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న మసీదుల్లో సర్వే నిర్వహించాలంటూ వేర్వేరు న్యాయస్థానాల్లో 18 కేసులు నమోదయ్యాయి. వాటి విచారణ ప్రక్రియను సుప్రీంకోర్టు 2024 డిసెంబర్ 12న నిలిపివేసింది. ప్రార్థనా స్థలాల చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ 2025 జనవరి 2న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.
ఈ అంశంలో ప్రధానమైన చర్చ అంతా సెక్షన్ 3, 4 మీద ఆధారపడి ఉంది. ఆ సెక్షన్లు కోర్టు ధార్మిక స్వభావాన్ని నిర్వచించి, దాన్ని మార్చేయడాన్ని నిలువరిస్తాయి. అలాగే కోర్టు పరిధిని కూడా పరిమితం చేస్తాయి. దేశంలోని పలు మసీదులు, ఇతర ప్రార్థనా స్థలాల విషయంలో సుదీర్ఘకాలంగా వివాదాలు ఉన్న సంగతిని ప్రస్తావిస్తూ… జ్ఞానవాపి మసీదు కమిటీ సహా ముస్లిం పక్షాలు… ప్రార్థనా స్థలాల చట్టం రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తున్న పిటిషన్లను కొట్టేయాలని వాదిస్తున్నాయి.