ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో తాము అద్భుతంగా జీవిస్తున్నామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ఎన్నికల ద్వారా ఓటింగ్‌లో పాల్గొని ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నామన్నారు. ఇటీవల జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓటు హక్కును వినియోగించుకున్న విషయాన్ని జైశంకర్ ప్రస్తావిస్తూ తన వేలికి ఉన్న సిరా చుక్కను చూపారు.
జర్మనీలోని మ్యూనిచ్ వేదికగా 61వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జైశంకర్, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం కష్టాల్లో కూరుకుపోయిందా? అనే ప్రశ్నకు దీటుగా సమాధానం చెప్పారు. భారత ఎన్నికల ప్రక్రియపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని ఫలితాలు విడుదలైన తర్వాత ఎలాంటి వివాదాలు ఉండవని చెప్పారు.
ప్రజాస్వామ్యం ప్రజల అవసరాలు తీర్చదని ఓ సెనేటర్ వ్యాఖ్యానించగా జైశంకర్ బదులిస్తూ, ప్రజాస్వామ్య భారత్ దాదాపు 800 మిలియన్ల మందికి పోషకాహారాన్ని సాయంగా అందిస్తుందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజాస్వామ్యం సమర్థంగా పనిచేస్తుండగా కొన్ని చోట్ల సవాళ్ళు ఎదురవుతున్నాయని అన్నారు. భారత్ లో రాజకీయ నిరాశావాదం ప్రబలంగా ఉందనే వాదనలను ఖండించారు.