వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చెందిన హైదరాబాద్లోని నివాసంలో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని బుధవారంనాడు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక ఆధారాల కోసం పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. వల్లభనేని వంశీ ఫోన్ స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వంశీ వ్యక్తిగత సహాయకుడి ఫోన్ను ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వల్లభనేని వంశీ ఫోన్ మాయంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వంశీ అరెస్టుకు ముందు డ్రస్ మార్చుకుని వస్తానంటూ గదిలోకి వెళ్లి తలుపేసుకుని ఫోన్ రహస్యంగా దాచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వంశీ ఫోన్ నుంచి ఎవరికి కాల్స్ వెళ్లాయనేది పోలీసులు విచారణ చేస్తున్నారు.వల్లభనేని వంశీ తరచూ వాట్సప్ కాల్స్ చేస్తుంటాడని సన్నిహితులు చెబుతున్నారు. ఫోన్ స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ఇప్పటికే విజయవాడ ఎస్టీ,ఎస్టీ అట్రాసిటీ కోర్టు అనుమతికి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.