సెమీకండక్టర్ టెక్నాలజీలో స్వయంసమృద్ధి సాధించే దిశలో భారత్ మరో ముందడుగు వేసింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రతిష్ఠాత్మక సంస్థలు ఐఐటీ మద్రాస్, ఇస్రో సంయుక్తంగా ఐరిస్ (ఐఆర్ఐఎస్ : ఇండైజెనస్ రిస్క్-వి కంట్రోలర్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్) చిప్‌ను అభివృద్ధి చేసాయి. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను సాకారం చేసే క్రమంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు… ఏరోస్పేస్, ఇతర కీలక రంగాలకు అత్యావశ్యకమైన అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్‌లో పెరుగుతున్న భారతీయ నైపుణ్యాలకు నిదర్శనంగా నిలిచింది.
‘శక్తి మైక్రోప్రోసెసర్’ మీద ఆధారపడిన ఈ ఐరిస్ చిప్… దేశీయ సెమీకండక్టర్ టెక్నాలజీని ముందుకు తీసుకువెళ్ళడంలో ఇస్రో, ఐఐటీ మద్రాస్ తదితర భారతీయ సంస్థల సంయుక్త కృషికి తార్కాణం. ఇస్రో ఇనెర్షియల్ సిస్టమ్స్ యూనిట్ (ఐఐఎస్‌యూ), తిరువనంతపురం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్ళింది. చిప్ డిజైన్, డెవలప్‌మెంట్ పని ఐఐటీ మద్రాస్ సమర్థంగా నిర్వహించింది.
ఇంక చిప్ తయారీ పనిని సెమీకండక్టర్ ల్యాబొరేటరీ, చండీగఢ్ పూర్తి చేసింది. తద్వారా చిప్ తయారీలో కీలకమైన కోర్ ఫ్యాబ్రికేషన్ ప్రక్రియ పూర్తిగా దేశీయంగానే జరిగింది. కర్ణాటకలోని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ చిప్ ప్యాకేజింగ్‌ను నిర్వహించింది. తద్వారా సెమీకండక్టర్ అసెంబ్లింగ్‌లో భారతీయుల సమర్థతను చాటింది. మదర్‌బోర్డ్ గుజరాత్‌లో తయారయింది. ఫైనల్ అసెంబ్లింగ్ చెన్నైలో జరిగింది. ఇలా సువిశా భారతదేశంలోని వివిధ ప్రాంతాల సమన్వయంతో పూర్తయిన ఈ ప్రాజెక్ట్… సెమీకండక్టర్ పరిశోధన, అభివృద్ధి రంగాల్లో భారతదేశం సాధించిన పురోగతికి నిదర్శనంగా నిలవడం మాత్రమే కాదు, భవిష్యత్తులో దేశీయంగా టెక్నాలజీ పరిశోధనలపై ఆశావాదాన్ని పెంపొందించింది.
సెమీకండక్టర్ టెక్నాలజీలో, ప్రత్యేకించి స్పేస్ అప్లికేషన్ల విషయంలో స్వయంసమృద్ధిని సాధించాలన్న భారతదేశపు లక్ష్యాన్ని సాకారం చేయడంలో ఓ గొప్ప ముందడుగుగా ఈ ప్రాజెక్టు ప్రాధాన్యం సంతరించుకుంది.
‘ఐరిస్ చిప్’ ప్రధానాంశాలు:
ఇస్రో కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ కోసం నిర్దుష్టంగా తయారు చేయబడింది.
స్పేస్ మిషన్స్‌లో విశ్వసనీయంగా పనిచేసేలా హై-ఫాల్ట్-టోలరెన్స్‌తో నిర్మించబడింది.
దీనిలో వాచ్‌డాగ్ టైమర్‌లు, అడ్వాన్స్‌డ్ సీరియల్ బస్‌ల వంటి కస్టమ్ మోడ్యూల్స్ ఉన్నాయి.
మల్టిపుల్ బూట్ మోడ్స్, హైబ్రిడ్ మెమొరీ ఎక్స్‌టెన్షన్స్ వంటి విస్తరణ సామర్థ్యాలు దీనిలో ఉన్నాయి.
డిజైనింగ్, ఉత్పత్తి, అసెంబ్లింగ్ పూర్తిగా భారతదేశంలోనే జరిగాయి.
సెమీకండక్టర్ సృజనాత్మక సామర్థ్యంతో ‘మేకిన్ ఇండియా’ దార్శనికతలో ముందడుగు పడింది.
ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి, ఆ సంస్థలోని ప్రతాప్ సుబ్రమణ్యం సెంటర్ ఫర్ డిజిటల్ ఇంటలిజెన్స్ అండ్ సెక్యూర్ హార్డ్‌వేర్ ఆర్కిటెక్చర్ (పిఎస్‌సి దిశ) కేంద్రంలో ఈ ‘శక్తి మైక్రోప్రోసెసర్ ప్రాజెక్టు’కు ఆధ్వర్యం వహించారు. భారత ప్రభుత్వపు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా రిస్క్-వి (డిఐఆర్‌వి) ఇనీషియేటివ్ ఫలితమైన రిస్క్-వి అనే ఓపెన్ సోర్స్ ప్రోసెసర్ టెక్నాలజీని వినియోగించి శక్తి ప్రోసెసర్లను తయారు చేసారు. ఈ ఐరిస్ అనేది విజయవంతంగా ఫ్యాబ్రికేట్ చేయబడిన మూడవ శక్తి చిప్ అని ప్రొఫెసర్ కామకోటి వెల్లడించారు. 2018లో ఫ్యాబ్రికేట్ చేసిన రిమో (RIMO), 2020లో ఫ్యాబ్రికేట్ చేసిన మౌషిక్ (MOUSHIK) మొదటి రెండు శక్తి చిప్‌లు.
ఐరిస్ చిప్ విజయం భారతదేశపు సెమీకండక్టర్ పరిశ్రమ ప్రగతిలో చెప్పుకోదగిన మైలురాయి. దేశీయంగా అభివృద్ధి చేసిన మైక్రోప్రోసెసర్లకు డిమాండ్ పెరుగుతుండడంతో, ఈ ఐరిస్ చిప్ ఆవిష్కరణ వివిధ రంగాల్లో అంతులేని అవకాశాలను కల్పించగలుగుతోంది. ఏరోస్పేస్ రంగంలోనే కాకుండా రక్షణ, ఆటోమోటివ్ తదితర రంగాల్లో ఈ చిప్ విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు.
పైగా, సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్‌లో పరిశోధన-అభివృద్ధి సామర్థ్యాలను మరింత ముందుకు తీసుకువెళ్ళగలదు. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు సంయుక్తంగా పనిచేస్తే సాధించగల విజయాలకు నిదర్శనం ఈ ప్రాజెక్టు. మైక్రోప్రోసెసర్ టెక్నాలజీలో పురోగతిని వేగవంతం చేయడమే కాదు, ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో భారత్ ప్రాధాన్యాన్ని ఒక్కసారిగా పెంచేసింది.
సెమీకండక్టర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భారతదేశం గణనీయంగా పెట్టుబడులు పెడుతోంది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ వంటి కార్యక్రమాల ద్వారా, అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలతో భాగస్వామ్యాల ద్వారా ముందడుగు వేస్తోంది. అలాంటి ప్రయత్నాల ఫలితంగా రూపొందిన ఐరిస్ చిప్, సెమీకండక్టర్ తయారీ, రూపకల్పనలో గ్లోబల్ హబ్ కాగల సామర్థ్యం భారత్‌కు ఉందని నిరూపణ అయింది.
ఫ్యాబ్రికేషన్ సంస్థలు, పరిశోధనా కేంద్రాలపై పెట్టుబడులను పెంచుకుంటూ వెళ్ళడం, ప్రతిభను అభివృద్ధి చేయడం ద్వారా భారతదేశం సెమీకండక్టర్ రంగంలో అగ్రగామిగా ఎదుగుతోంది. దానివల్ల విదేశీ దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది, కీలక రంగాల్లో సాంకేతిక సార్వభౌమత్వం సాధ్యమవుతుంది.